Narsapur: లింగాపూర్‌లో పంటల వైవిధ్యీకరణపై రైతులకు ప్రత్యేక శిక్షణ!
Narsapur: నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Narsapur: లింగాపూర్‌లో పంటల వైవిధ్యీకరణపై రైతులకు ప్రత్యేక శిక్షణ!
నర్సాపూర్: వరి సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తూ, పంటల వైవిధ్యీకరణపై నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ రైతు వేదికలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ సహచర అభ్యాసం శిక్షణ కార్యక్రమంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపు, నేల ఆరోగ్యం, సాగు ఖర్చుల తగ్గింపు, రైతుల ఆదాయ పెంపుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా టీఆర్‌వీకే శాస్త్రవేత్త డా. సతీష్ మాట్లాడుతూ.. వరి సాగులో అధికంగా నీటి వినియోగం జరుగుతుందని, దీంతో సాగు ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వివరించారు. రైతులు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
కందులు, పెసలు, మినుములు, శనగ, మొక్కజొన్న, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయడం ద్వారా పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించవచ్చని తెలిపారు. ఒకే పంటపై ఆధారపడకుండా పంటల మార్పిడి విధానాన్ని అవలంబించడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో సాగు ఖర్చులను తగ్గించుకుని, మార్కెట్ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే రైతుల ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
మండల వ్యవసాయ అధికారిణి దీపిక మాట్లాడుతూ.. రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వరి సాగుతో పాటు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. పంటల వైవిధ్యీకరణ ద్వారా రైతులు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కొంతవరకు ఎదుర్కోవడంతో పాటు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవచ్చని తెలిపారు.
శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతుల ప్రాథమిక అవగాహన స్థాయిని తెలుసుకునేందుకు ప్రీ-ఎవాల్యుయేషన్, శిక్షణ అనంతరం అవగాహనలో వచ్చిన మార్పును అంచనా వేసేందుకు పోస్ట్-ఎవాల్యుయేషన్ నిర్వహించారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలు, పంటల మార్పిడి, నీటి యాజమాన్యం, నేల ఆరోగ్యం, మార్కెట్‌కు అనుగుణంగా పంటల ఎంపిక తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
“నీటి పొదుపు – నేల ఆరోగ్యం – పంటల వైవిధ్యీకరణ – రైతు ఆదాయం పెంపు” అనే లక్ష్యంతో ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ వ్యవసాయ విస్తరణ అధికారులు దుర్గా ప్రసాద్, తేజస్విని, రాజశేఖర్, లావణ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.