Nandyal: దేశాన్ని కాపాడిన సైనికుడికి సొంత కొడుకే ద్రోహం!
Nandyal: నంద్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
Nandyal: దేశాన్ని కాపాడిన సైనికుడికి సొంత కొడుకే ద్రోహం!
Nandyal: దేశ సరిహద్దుల్లో మూడు దశాబ్దాల పాటు సేవలందించి దేశాన్ని కాపాడిన ఓ మాజీ సైనికుడి జీవితం... ఇప్పుడు కన్న కొడుకే కన్నీటి గాథగా మార్చాడు.వృద్ధాప్యంలో అండగా నిలవాల్సిన కుమారుడు... ఆస్తి, నగదు, బంగారం కాజేసి తల్లిదండ్రులను అనాథల్లా వదిలేశాడనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.చివరకు కన్న ప్రేమను పక్కనపెట్టి... న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన దుస్థితి. ఈ హృదయ విదారక ఘటన నంద్యాల జిల్లా లో చోటుచేసుకుంది.
నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్‌కు చెందిన 76 ఏళ్ల మాజీ సైనికుడు పటాన్ సయ్యద్ హుస్సేన్... భారత సైన్యంలో 30 సంవత్సరాల పాటు సేవలందించారు. దేశ భద్రత కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆయన... 2008లో పదవీ విరమణ చేశారు.
ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమైన భార్య ఖాదర్ బీ కి సేవలు చేస్తూ... తీవ్ర ఆర్థిక, మానసిక కష్టాల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్‌లో పెద్ద కుమారుడు పటాన్ అహ్మద్ బాషా... “మీ ఇద్దరినీ బాగా చూసుకుంటాను” అంటూ తల్లిదండ్రులను హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.కానీ ప్రేమగా తీసుకెళ్లిన కొడుకు... ఆ తర్వాత అసలు రూపం చూపాడని బాధిత ఆరోపిస్తున్నారు.
సయ్యద్ హుస్సేన్ జీవితాంతం పొదుపు చేసిన రూ.4 లక్షల నగదును తీసుకున్నాడు.అక్కడితో ఆగకుండా... ఆయన పేరుపై లో మరో రూ.4 లక్షల రుణం తీసుకుని, ఆ EMI ప్రతి నెలా మాజీ సైనికుడి పెన్షన్ నుంచే కట్ అయ్యేలా చేశాడు.ఇక తల్లి ఖాదర్ బీ బంగారు ఆభరణాలను తనఖా పెట్టి... మరో రూ.2 లక్షల రుణం తీసుకున్నట్లు బాధితుడి ఆవేదన..
డబ్బు, బంగారం, ఇంటి పత్రాలు అన్నీ తీసుకున్న తర్వాత... తల్లిదండ్రుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చూపాడని తెలుస్తోంది.కడుపునిండా భోజనం కూడా పెట్టకుండా... అవమానాలకు గురిచేయడంతో తల్లిదండ్రులు తిరిగి నంద్యాల కు చేరుకున్నారు.పక్షవాతంతో బాధపడుతున్న భార్య వైద్యం, ఇంటి ఖర్చులు భరించడం సయ్యద్ హుస్సేన్‌కు భారంగా మారింది.రెండో కుమారుడు అప్పుడప్పుడు మాత్రమే ఆర్థిక సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
తన డబ్బు, బంగారం, ఇంటి పత్రాలు తిరిగి ఇప్పించడంతో పాటు... తన పేరుపై తీసుకున్న రుణాలను రద్దు చేయాలని కోరుతూ మాజీ సైనికుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.. ఫిర్యాదు మేరకు...అహ్మద్ బాషాపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నంద్యాల త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు.
నంద్యాల త్రీ టౌన్ సిఐ వేణుగోపాల్ మాట్లాడుతూ కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం కేవలం మానవత్వానికి విరుద్ధమే కాదు… చట్టరీత్యా కూడా నేరమని స్పష్టం చేశారు.మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్–2007 ప్రకారం…తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వారి సంరక్షణ బాధ్యతను విస్మరించే పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే…విచారణ అనంతరం నిర్లక్ష్యం చేసిన పిల్లలపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాంటి వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించే అవకాశం ఉందన్నారు.“పిల్లలు తమ కన్న తల్లిదండ్రులను ప్రేమతో, బాధ్యతతో చూసుకోవాలి. వారిని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు” అన్నారు సీఐ వేణుగోపాల్.
దేశాన్ని కాపాడిన సైనికుడిని... సొంత కొడుకే కాపాడలేకపోయాడు.శత్రువులతో పోరాడిన చేతులు... ఇప్పుడు న్యాయం కోసం వణుకుతున్నాయి.వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన పిల్లలు... భారంగా మారితే సమాజం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.