Kurnool: కాలనీ పార్కుల నిర్వహణకు కొత్త గైడ్‌లైన్స్
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని పార్కుల నిర్వహణపై కమిషనర్ చల్లా ఓబులేసు సమీక్ష నిర్వహించారు.
Kurnool: కాలనీ పార్కుల నిర్వహణకు కొత్త గైడ్‌లైన్స్
కర్నూలు: నగరపాలక సంస్థ పరిధిలోని పార్కుల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శుక్రవారం నగరపాలక కార్యాలయంలో పార్కుల విభాగ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని పార్కులు ప్రజల విశ్రాంతి, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. అందువల్ల పార్కులను ఇష్టానుసారంగా నిర్వహించడం, వాటి స్వరూపాన్ని మార్చడం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించడం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఇప్పటికే పార్కుల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన అపార్ట్మెంట్ అసోసియేషన్లు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు తదితర నిర్వాహకులు తప్పనిసరిగా నగరపాలక సంస్థలో వ్రాతపూర్వకంగా దరఖాస్తు చేసి అనుమతి పొందాలని సూచించారు. అలాగే కొత్తగా పార్కుల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి ఉన్న సంస్థలు, సంఘాలు కూడా నగరపాలక సంస్థను సంప్రదించాలని కోరారు.
పార్కుల్లో ఎలాంటి శాశ్వత లేదా తాత్కాలిక కట్టడాలు నిర్మించడం, సమావేశాలు, శుభకార్యాలు, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం, పార్కు స్వరూపంలో మార్పులు చేయడం, అనుమతి లేకుండా పెయింటింగ్‌లు వేయడం, మొక్కలను తొలగించడం, ప్రజల వినియోగానికి ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడడం వంటి చర్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారికి అప్పగించిన పార్కుల నిర్వహణ బాధ్యతలను వెంటనే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. పార్కుల నిర్వహణలో భాగస్వామ్యమయ్యే ప్రతి సంఘం నగరపాలక సంస్థ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సంబంధిత ఒప్పందం, అనుమతులను పూర్తి చేసుకోవాలని సూచించారు.
నగరంలోని ప్రతి పార్కు పరిశుభ్రంగా, పచ్చదనంతో, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ఎంఈ మనోహర్ రెడ్డి, డీఈఈ కృష్ణలత, హార్టికల్చర్ ఏడీ ప్రతాప్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.