Kurnool: కర్నూలు ప్రభుత్వ కళాశాలలో మహనీయులకు ఘన నివాళి!
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో అల్లూరి సీతారామరాజు జయంతి, స్వామి వివేకానంద, పింగళి వెంకయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Kurnool: కర్నూలు ప్రభుత్వ కళాశాలలో మహనీయులకు ఘన నివాళి!
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో మన్యం వీరుడు, అమర స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి, యువతకు స్ఫూర్తిప్రదాత స్వామి వివేకానంద వర్ధంతి, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ (Guinness Book of World Record Holder) గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు, ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం చేసిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాగే స్వామి వివేకానంద బోధనలు యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, సేవాభావాన్ని పెంపొందిస్తాయని, పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం భారత జాతి గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో అధ్యాపకులు అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర, రంపా తిరుగుబాటులో ఆయన నాయకత్వం, స్వామి వివేకానంద సందేశాలు, పింగళి వెంకయ్య భారత జాతీయ పతాక రూపకల్పనలో చేసిన విశిష్ట సేవలను విద్యార్థులకు వివరించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద, పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. దేశభక్తి గీతాలు ఆలపించి, మహనీయుల ఆశయాలను జీవితంలో ఆచరించాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మల్లికార్జున, విజయ శేఖర్, రామకృష్ణ, సోమేష్, ఉల్గోజి రావు, శారధి పటేల్, చిన్న మల్లేష్, కృష్ణ మోహన్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
చివరగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు, జాతి నిర్మాతలు మరియు ఆధ్యాత్మిక మహనీయుల త్యాగాలు, బోధనలు ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని, వారి ఆశయాల సాధనకు యువత ముందుండాలని పిలుపునిచ్చారు.