Donald Trump: చైనాకు ట్రంప్‌ వార్నింగ్‌

Donald Trump: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ చైనా తీరుపై అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు.

Update: 2026-04-12 05:38 GMT

Donald Trump: చైనాకు ట్రంప్‌ వార్నింగ్‌

Donald Trump: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ చైనా తీరుపై అధ్యక్షుడు ట్రంప్ నిప్పులు చెరిగారు. యుద్ధ సమయంలో టెహ్రాన్‌కు బీజింగ్ అండగా నిలవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయుధ సరఫరాను తక్షణమే నిలిపివేయకుంటే చైనా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తూ అంతర్జాతీయ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

చైనాకు అమెరికా హెచ్చరిక

యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ స్పందించారు. టెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్‌ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించి ఆయుధాలను చేరవేస్తే ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ

మరోవైపు చమురు నౌకల ప్రయాణానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడానికి తమ దళాలు శ్రమిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అక్కడ శత్రు దేశం అమర్చిన సీమైన్స్‌ను తొలగించే ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పారు. ఇరాన్‌తో చర్చలు ప్రస్తుతం ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పటికీ, అంతిమ విజయం అమెరికాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సైనిక పరంగా ఇరాన్‌ను ఇప్పటికే ఓడించామని, అయితే యుద్ధం విషయంలో నాటో కూటమి నుంచి అమెరికాకు ఎటువంటి ఆయుధ లేదా దౌత్య సాయం లభించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

చైనా రహస్య ఆయుధ ఒప్పందం?

అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను పునర్నిర్మించుకోవడానికి చైనా సహాయం తీసుకుంటోంది. భుజం మీద పెట్టుకొని ప్రయోగించే స్వల్ప శ్రేణి క్షిపణి లాంచర్‌లను, ఇతర అధునాతన వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్‌ ప్రణాళిక రచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా విమానాలు, డ్రోన్లను కూల్చడానికి ఇరాన్‌ వీటిని ఉపయోగిస్తోందని తెలుస్తోంది.

వారంలోపు ఈ ఆయుధాలు టెహ్రాన్‌కు చేరే అవకాశం ఉందని సమాచారం. అయితే, చైనా తన ప్రమేయం బయటపడకుండా ఉండేందుకు ఇతర దేశాల మీదుగా ఈ ఆయుధాలను తరలిస్తున్నట్లు నిఘా నివేదికలు చెబుతున్నాయి.

ఖండించిన బీజింగ్..

వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఈ వార్తలను తీవ్రంగా ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికి ఆయుధాలు సరఫరా చేయలేదని పేర్కొంది. మరోవైపు, చైనా నుంచి ఆయుధాలు అందినట్లు ఇరాన్‌ బహిరంగంగా ప్రకటించనప్పటికీ, అమెరికా విమానాలను విజయవంతంగా కూల్చడానికి తమ వద్ద ఉన్న అధునాతన రక్షణ వ్యవస్థలే కారణమని ఇరాన్ విప్లవ దళాలు (ఐఆర్‌జీసీ) వెల్లడించడం గమనార్హం. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో మరింత అశాంతికి దారితీసేలా కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News