Iran Warning: ఇరాన్‌ మరో హెచ్చరిక.. ఆ జలసంధిని కూడా టార్గెట్‌ చేస్తాం

Iran Warning: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రంగా మారుతున్నట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Update: 2026-04-06 03:49 GMT

Iran Warning: ఇరాన్‌ మరో హెచ్చరిక.. ఆ జలసంధిని కూడా టార్గెట్‌ చేస్తాం

Iran Warning: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత తీవ్రంగా మారుతున్నట్టు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్‌ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్‌ జలసంధిపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నవేళ, ఇప్పుడు బాబ్‌ ఎల్‌ మాండెజ్‌ జలసంధిని కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నట్టు ఇరాన్‌ హెచ్చరించడం పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.

హోర్ముజ్‌పై షరతులు

హోర్ముజ్‌ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు సుమారు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. ఈ మార్గం మూసుకుపోతే ప్రపంచ చమురు సరఫరా గొలుసు దెబ్బతినడం ఖాయం. ఈ నేపథ్యంలో అమెరికా ఈ మార్గాన్ని తిరిగి తెరవాలని గడువు విధించగా, ఇరాన్ మాత్రం తన షరతులను స్పష్టం చేసింది. యుద్ధం వల్ల తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిందేనని, హోర్ముజ్ ద్వారా వచ్చే ఆదాయంలో వాటా ఇస్తేనే రవాణాకు అనుమతి ఇస్తామని టెహ్రాన్ ప్రకటించింది. పరిహారం, వాటా అనే అంశాన్ని ఇరాన్‌ గట్టిగా వాదిస్తుండటం, అటు అమెరికా డెడ్‌లైన్‌ విధించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ప్రపంచదేశాల్లో నెలకొంది. ఈ ఉద్రిక్తతలు ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు. తాజాగా ఇరాన్‌ కీలక నాయకులు కొన్ని ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలతో ఉద్రిక్తత మరింతగా మారే అవకాశం కనిపిస్తోంది.

ఎర్రసముద్రంపై దాడి

రవాణాకు హోర్ముజ్‌ జలసంధి ఎంత కీలకమో.. ఎర్రసముద్రంలోని బాబ్‌ ఎల్‌ మాండేజ్‌ జలసంధి కూడా అంతే కీలకం. అవసరమైతే తాము బాబ్‌ ఎల్‌ మాండేజ్‌ జలసంధిపై కూడా దాడి చేస్తామని, తమ రాకెట్ల పరిధిలోనే ఆ జలసంధి కూడా ఉందని హెచ్చరించారు. ఈ బాబ్‌ ఎల్‌ మాండేజ్‌ జలసంధి ద్వారా 12 శాతం రవాణా జరుగుతుంది. యూరప్‌ ఆసియా మధ్య సరుకు రవాణాకు ఈ జలసంధి ప్రధాన మార్గం. ఈ మార్గంలో అడ్డంకులు ఎదురైతే గ్లోబల్‌ ట్రేడ్‌ వ్యవస్థ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా హోర్ముజ్‌ జలసంధి గుండా కొన్ని నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. అతికొద్ది నౌకలకు మాత్రమే అనుమతి ఉండటంతో చమురు రవాణాకు తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ఫలితంగా మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి.

ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం

పశ్చిమాసియా సంక్షోభానికి ముందు ముడి చమురు బ్యారెల్‌ ధర 50 నుంచి 60 డాలర్ల వరకు ఉండగా.. ఇప్పుడు అది 100 డాలర్లను దాటింది. ఈ పరిస్థితి మరింత విషమిస్తే బ్యారెల్‌ చమురు 150 నుంచి 170 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ఇంధన రంగానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. భారత్‌ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ పరిణామాలు మరింత సవాల్‌గా మారతాయి. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం కలిగితే దేశీయ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం అనివార్యం. ఇప్పటికే సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా వంటగ్యాస్, ఇంధన ధరలు పెరుగుతున్నాయి. యుద్దం మరింత విస్తరించకుండా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాల్సిన అవసరం అత్యవసరంగా మారింది. లేదంటే ఈ సంక్షోభం గ్లోబల్ స్థాయిలో మరింత పెద్ద ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News