Iran Israel War : అణు వినాశనం అంచున ప్రపంచం.. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు

Iran Israel War : ఇరాన్‌లోని బుషెహర్ అణు ప్లాంట్‌పై దాడులు తీవ్రమయ్యాయి. రేడియేషన్ లీక్ అయితే గల్ఫ్ దేశాలన్నీ ప్రభావితమవుతాయని ఇరాన్ హెచ్చరించింది. అణు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-04-05 03:52 GMT

Iran Israel War 

Iran Israel War : మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు అత్యంత భయంకరమైన దశకు చేరుకుంది. ఇరాన్ తీర ప్రాంతంలోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడులు ప్రపంచాన్ని వణికించేలా చేస్తున్నాయి. నెల రోజుల్లోనే ఈ ప్లాంట్‌పై దాడి జరగడం ఇది నాలుగోసారి. ఈ దాడులు గనుక ముదిరితే అణు విస్ఫోటనం సంభవించి, దాని ప్రభావం కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలన్నింటికీ పాకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ దక్షిణ తీరంలో ఉన్న బుషెహర్ అణు విద్యుత్ కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు పెంచడంతో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఒకే నెలలో నాలుగుసార్లు ఈ ప్లాంట్ లక్ష్యంగా దాడులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ బుషెహర్ ప్లాంట్‌పై నేరుగా దాడి జరిగితే, అక్కడ విడుదలయ్యే రేడియేషన్ కేవలం టెహ్రాన్ వరకే ఆగదని, అది సముద్ర గాలుల ద్వారా గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల రాజధానులకు కూడా పాకుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది జరిగితే యావత్ అరబ్ దేశాలు అణు ప్రభావానికి గురవుతాయని ఆయన భయాందోళన వ్యక్తం చేశారు.

సాధారణంగా యుద్ధం అంటే అణు బాంబుల గురించే అందరూ చర్చిస్తారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అణు బాంబు కంటే కూడా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా క్షిపణి పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా అణు ప్లాంట్‌లోని రియాక్టర్ కోర్, కూలింగ్ సిస్టమ్ వంటి సున్నితమైన భాగాలపై పడితే భయంకరమైన రేడియేషన్ లీక్ అవుతుంది. దీనివల్ల వందల కిలోమీటర్ల మేర గాలి, నీరు విషతుల్యమవుతాయి. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, సముద్ర జీవరాశి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) ప్రస్తుతం రేడియేషన్ స్థాయిలు పెరగలేదని చెప్పినప్పటికీ, అణు కేంద్రాలపై దాడులు జరగడం ఏమాత్రం క్షేమం కాదని హెచ్చరించింది.

అటు ఇరాన్ కూడా తక్కువ తినలేదు. ఇజ్రాయెల్‌లోని డిమోనా న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుసగా క్షిపణులను ప్రయోగిస్తోంది. మార్చి చివరి వారంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నెగెవ్ ఎడారిలోని డిమోనా ప్లాంట్‌కు అతి సమీపంలో పడ్డాయి. డిమోనా ప్లాంట్‌లో ఇజ్రాయెల్ సుమారు 90కి పైగా అణు బాంబులను నిల్వ ఉంచినట్లు సమాచారం. ఒకవేళ ఇరాన్ క్షిపణులు గనుక ఈ ప్లాంట్‌ను తాకితే, హిరోషిమా-నాగాసాకి కంటే వంద రెట్లు ఎక్కువ విధ్వంసం జరుగుతుందని, మొత్తం మధ్య ప్రాచ్యం మ్యాప్ నుంచే కనుమరుగవుతుందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బుషెహర్ ప్లాంట్‌పై జరుగుతున్న దాడులను ఉక్రెయిన్‌లోని జపోరోజియా అణు ప్లాంట్ పై జరిగిన దాడులతో ఇరాన్ పోలుస్తోంది. గతేడాది ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ అణు ప్లాంట్లపై డ్రోన్లు, మిసైళ్లు దాడి చేసిన దృశ్యాలను అంతర్జాతీయ మీడియా ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఇరాన్‌లో కూడా అదే పరిస్థితి పునరావృతమవుతోంది. క్షిపణులు లక్ష్యం తప్పినా లేదా వ్యూహాత్మకంగా ప్లాంట్‌ను ఢీకొట్టినా, అది మానవ చరిత్రలోనే అతిపెద్ద విపత్తుగా మారుతుంది. అణు కేంద్రాలను యుద్ధం నుంచి మినహాయించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నా, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పంతాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Tags:    

Similar News