Hyderabad: అక్రమ ఆయుధాల విక్రయం.. అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్!

Hyderabad: బీహార్ నుంచి తుపాకులు తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర నిందితుడిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2026-08-22 14:06 GMT

Hyderabad: అక్రమ ఆయుధాల విక్రయం.. అంతర్రాష్ట్ర నేరస్థుడి అరెస్ట్!

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అక్రమ ఆయుధాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, బొల్లారం పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. అతడి నుంచి రెండు 9 ఎంఎం పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, 17 లైవ్ రౌండ్లు, ఒక డబుల్ బ్యారెల్ తపంచా, మరో రెండు లైవ్ రౌండ్లు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్భాన్స్ కుమార్ (27) ప్రస్తుతం చెర్లపల్లి ప్రాంతంలో నివసిస్తూ కూలీగా పనిచేస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ ఆయుధాల విక్రయానికి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నెల 10న బీహార్‌కు వెళ్లిన పర్భాన్స్ కుమార్.. సోను అనే వ్యక్తి నుంచి తక్కువ ధరకు ఆయుధాలను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వీటిని నేరాలకు పాల్పడే వ్యక్తులకు అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు 22న తెల్లవారుజామున 5.50 గంటలకు బొల్లారంలోని సాధన మందిర్ వద్ద పర్భాన్స్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.అతడి వద్ద తనిఖీలు నిర్వహించగా ఆయుధాలు, బుల్లెట్లు లభించాయి.

నిందితుడిపై గతంలోనూ కేసు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2024లో చెర్లపల్లి పోలీసులు గంజాయి, గంజాయి చాక్లెట్ల అక్రమ రవాణా కేసులో అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ ఘటనపై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో ఆయుధ చట్టంలోని 25(1ఏ), 25(1బీ)(ఏ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పర్యవేక్షణలో ఎస్‌ఓటీ, బొల్లారం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం, కొనుగోలు చేయడం, విక్రయించడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరించారు. అక్రమ ఆయుధాల కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి నేరరహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని ప్రజలను కోరారు.

Tags:    

Similar News