Nizampet: తుర్కచెరువు, ఎర్రకుంట పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్!

Nizampet: హైదరాబాద్‌లో రెండో విడత చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Update: 2026-08-22 15:15 GMT

Nizampet: తుర్కచెరువు, ఎర్రకుంట పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్!

నిజాంపేట‌: న‌గ‌రంలో రెండో విడ‌త చేప‌ట్టిన చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ శ‌నివారం క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. బాచుప‌ల్లిలోని ఎర్ర‌కుంట‌, నిజాంపేట‌లోని తుర్క‌చెరువు, అభివృద్ధి ప‌నుల‌ను త‌నిఖీ చేశారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న తీరుపై సంతృప్తి వ్య‌క్తం చేశారు.

చెరువుల్లో పూడిక తీత పూర్తి స్థాయిలో చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. బాచుప‌ల్లిలోని ఎర్ర‌కుంట నుంచి క‌త్వాకుంట‌కు అనుసంధానంగా ఉన్న మురుగు, వ‌ర‌ద కాలువ‌ల అనుసంధానం లేక‌పోవ‌డంతో జీపీఆర్ లే ఔట్ అంతా మురుగు నీరు నిల‌వ‌డాన్ని స్థానికులు ఈ సంద‌ర్భంగా క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు.

జీపీఆర్ లే ఔట్‌లో కాలువ నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ స‌మ‌స్య‌ను సీఎంసీ క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లి.. ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఎర్ర‌కుంట పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే.. మురుగు నీటిని డైవ‌ర్ట్ చేయ‌డానికి కూడా ఈ కాలువ‌లు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.

ఆల‌య క‌మిటీల‌తో త్వ‌ర‌లోనే స‌మావేశ‌మౌతాం..

నిజాంపేట‌లో తుర్క చెరువు చెంత అనేక ఆల‌యాలున్నాయ‌ని.. వీటన్నిటినీ ఒకే చోట‌కు తీసుకు వ‌చ్చేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ చెప్పారు. ఆల‌య క‌మిటీల ప్ర‌తినిధుల‌తో పాటు.. స్థానికుల‌తో త్వ‌ర‌లోనే స‌మావేశాన్ని ఏర్పాటు చేసి ఇందుకు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. తుర్క చెరువులోంచి వ‌ర‌ద నీరు పాప‌య్య‌కుంట‌కు చేరేలా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా మళ్లింపు చర్యలు చేపట్టి, సుమారు 1,200 మీటర్ల పొడవైన పైప్‌లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక్క‌డ చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న తాత్కాలిక షెడ్డుల‌ను కూడా తొల‌గించాల‌ని సూచించారు.

*హైడ్రా క‌మిష‌న‌ర్‌కు స‌న్మానం..

తుర్క చెరువులో 3 మీట‌ర్ల మేర పూడిక తీయ‌డం.. మురుగు నీరు పోవ‌డంతో దోమ‌ల బెడ‌ద తొల‌గింద‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. చెరువులో దుర్గంధం పోవ‌డంతో అంద‌రం ఊపిరి పీల్చుకుంటున్నామ‌ని.. మొద‌టి విడ‌త అభివృద్ధి చేసిన మాదిరే ఈ చెరువును కూడా తీర్చి దిద్దాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా చెరువు ప‌రిస‌ర నివాసితులు హైడ్రా క‌మిష‌న‌ర్‌కు శాలువ‌తో స‌త్క‌రించారు. మంగ‌ళ‌హార‌తి ప‌ట్టి మీ వెంట మేమున్నామ‌ని చెప్పారు. చెరువుల‌ను కాపాడ‌డం, పున‌రుద్ధ‌రించ‌డం సామాన్య విష‌యం కాద‌ని అన్నారు. పార్కులు, చెరువులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, నాలాల‌ను కాపాడుతూ న‌గ‌రాన్ని పున‌ర్నిర్మాణం చేస్తున్నారంటూ కితాబిచ్చారు. హైడ్రాపైన ప్ర‌జ‌ల్లో ఎంతో విశ్వాసం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా మ‌ద్ధ‌తు తెలిపారు.

Tags:    

Similar News