Shahbad: పత్తి పంటలో చీడపీడల నివారణకు ఏవో దండెం విజయచంద్ర కీలక సూచనలు!
Shahbad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం బోడంపహాడ్‌లో ఆత్మ ఆధ్వర్యంలో ఉచిత ఇన్‌పుట్స్ పంపిణీ. పత్తి పంటలో తెగుళ్లు, పురుగుల సమగ్ర యాజమాన్యంపై ఏవో విజయచంద్ర సూచనలు.
Shahbad: పత్తి పంటలో చీడపీడల నివారణకు ఏవో దండెం విజయచంద్ర కీలక సూచనలు!
Shahbad: ఈ రోజు మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర, షాబాద్ మండలం బోడంపహాాడ్ గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో ఆత్మ క్షేత్ర ప్రదర్శనలో భాగంగా పిచ్చకుంట్ల.
రాజు వరిలో పంటకు వేప నూనె 500మీ.లి, ట్రైకోడెర్మా విరిడి 1కేజీ, నానో యూరియా 500మీ.లి, నానో డి ఎ పి 500 మీ.లి, కార్బోప్యూరాన్ గుళికలు 3కేజీలు, చిలేటెడ్ జింక్ 500గ్రాములు రైతులకు ఎకరాకు ఉచ్చితంగా ఇన్ పుట్స్ క్షేత్ర ప్రదర్శన ద్వారా ఇవ్వడం జరిగినది, అలాగే గ్రామంలో రైతుల పత్తి పంటలను పరిశీలించి పత్తి పంటలో అధిక దిగుబడి, నాణ్యమైన పత్తి ఉత్పత్తి కోసం సమతుల్య ఎరువుల వినియోగం, సూక్ష్మ పోషకాల నిర్వహణ, తెగుళ్లు మరియు పురుగుల సమగ్ర యాజమాన్యం అత్యంత అవసరం.
ముఖ్యంగా ఎల్-నినో నేపథ్యంలో తేమ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది సూచనలు పాటించాలి.
సూక్ష్మపోషకాల పిచికారి:
45 నుండి 50 రోజుల దశలో 19:19:19, 10 గ్రా, లీటరు లేదా13:0:45, 10 గ్రా లీటరు, వర్షాభావ పరిస్థితుల్లో ద్రావణం పిచికారీ చేయడం వల్ల మొక్కలకు ఒత్తిడి తగ్గుతుంది.
పత్తిని ఆశించే పురుగులు నివారణ చర్యలు:
బీటీ పత్తిలో రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. పత్తి పంటను పరిశీలించి, రైతులు తీసుకోవలసిన నివారణోపాయాలపై సూచనలు, కాండానికి పూత పద్ధతి పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను అదుపు చేయడానికి కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి.
30 నుండి 45 రోజుల దశలో: మోనోక్రోటోఫాస్ మందును 1:4 నిష్పత్తిలో ఒక భాగం మందు, నాలుగు భాగాలు నీరు కలిపి కాండానికి పూయాలి.
60 రోజుల దశలో: ఇమిడాక్లోప్రిడ్ మందును 1:20 నిష్పత్తిలో ఒక భాగం మందు, 20 భాగాలు నీరు కలిపి పూయాలి. ఈ పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి వంటి పురుగులను ఎటువంటి పురుగుమందుల పిచికారీ లేకుండానే 70 నుండి 80 రోజుల వరకు అదుపు చేయవచ్చు.
మొదట్లోనే పంటపై కెమికల్స్ పిచికారీ చేయకపోవడం వల్ల పొలంలో మిత్రపురుగుల సంఖ్య పెరిగి, అవి సహజంగానే చీడపీడలను అదుపు చేస్తాయి. దీనితో పాటు ఎకరాకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి.
కాయతొలుచు పురుగులు ఆశించే పంట 60 నుంచి 90 రోజుల దశకు చేరుకున్నప్పుడు, పూత ఏర్పడిన దగ్గరి నుంచి కాయతొలుచు పురుగులు ఆశించడం మొదలవుతుంది. ముఖ్యంగా శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులు వివిధ దశల్లో ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి.
నష్టపరిమితి స్థాయి పొలంలో 90 శాతం మొక్కలను పరిశీలించినప్పుడు, ఒక్కో మొక్కకు ఒక గూడు పురుగు చేసిన రంధ్రం లేదా చిన్న చిన్న గూళ్లు కనిపిస్తే లేదా 5 శాతం మొగ్గలు/కాయలు దెబ్బతింటే నివారణ చర్యలు చేపట్టాలి.
పచ్చదోమ నివారణకు:
5 శాతం లేదా 0.5 శాతం వేపగింజల కషాయాన్ని/వేపనూనెను పిచికారీ చేయాలి.
పొగాకు లద్దె పురుగు నివారణకు:
లీటరు నీటికి 1.0 మి.లీ. నోవాల్యురాన్ లేదా 1.0 మి.లీ. లూఫెన్యూరాన్ లేదా 0.5 మి.లీ. ఇమామెక్టిన్ బెంజోయేట్ కలిపి పిచికారీ చేయాలి.
శనగపచ్చ పురుగు ఆశించు పంట 90 నుంచి 120 రోజుల దశలో ఉన్నప్పుడు శనగపచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 90 రోజుల తర్వాత బీటీ పత్తిలో గూడ, పిందెల్లో ఉండే బీటీ టాక్సిన్ (ప్రోటీన్) స్థాయి క్రమేపీ తగ్గుతుంది. దీనివల్ల శనగపచ్చ పురుగులు పంటపై నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.
ఈ దశలో పురుగు ఉధృతి గమనించి, అవసరాన్ని బట్టి 1 లేదా 2 సార్లు మాత్రమే కీటక నాశనులను వాడాలి. లీటరు నీటికి 1.5 గ్రాముల థయోడికార్బ్ లేదా 2.0 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ నివారణకు కూడా సిఫార్సు చేసిన మందులను వాడాలి.
గులాబీ రంగు పురుగు, పిండినల్లి ఉధృతి 120 రోజులు దాటిన తర్వాత గులాబీ రంగు పురుగు మరియు పిండినల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు నష్టాన్ని గమనించడానికి పొలంలో అక్కడక్కడా కాయలను కోసి పరిశీలించాలి. 10 కాయల్లో కనీసం ఒక పురుగు ఉన్నా అది ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించాలి.
లింగాకర్షక బుట్టలు: పంట 45 రోజుల వయసు ఉన్నప్పటి నుంచే గులాబీ రంగు పురుగు ఉనికిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 8 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. వరుసగా 3 రోజుల పాటు బుట్టకు 8 తల్లి రెక్కల పురుగులు చొప్పున పడితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఆకు ముడత వైరస్‌కు ప్రత్యక్ష మందు లేదు, తెల్లదోమను సమర్థంగా నియంత్రించాలి.
తీవ్రంగా సోకిన మొక్కలను తొలగించి నాశనం చేయాలి. ఆర్థిక నష్టం స్థాయి చేరిన తర్వాత మాత్రమే పురుగు మందులు పిచికారీ చేయాలి. ఒకే రకం మందును వరుసగా వాడకూడదు. పసుపు మరియు నీలం స్టిక్కీ ట్రాప్స్ ఎకరానికి 10–12 ఏర్పాటు చేయాలి. కలుపు మొక్కలను తొలగించాలి. అధిక నత్రజని ఎరువులు వేయకూడదు. సిఫార్సు మోతాదులోనే మందులు వాడాలి.
ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయాలి. పిచికారీ సమయంలో వ్యక్తిగత రక్షణ పరికరాలు తప్పనిసరిగా ఉపయోగించాలి. ఎల్-నినో నేపథ్యంలో నేలలో తేమను సంరక్షిస్తూ అవసరమైనప్పుడు మాత్రమే నీటి యాజమాన్యం చేపట్టండి.
వీరి వెంట వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు పిచకుంట్ల రాజు, రఘునాథ్ రెడ్డి, మిరియాల వెంకయ్య, రాఘవేందర్, ప్రకాష్ తదితర రైతులు పాల్గొన్నారు.