Weather Update : తెలుగు రాష్ట్రాలంలే భగ్గుమంటున్న సూరీడు.. 100కు పైగా మండలాల్లో డేంజర్ బెల్స్
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మాడు పగిలే ఎండలు కాస్తున్నాయి.ఐఎండీ ఏపీలో వడగాల్పుల హెచ్చరిక జారీ చేసింది. అలాగే తెలంగాణలో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతున్నాయి.
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెలలోనే ఎండలు మాడు పగిలేలా కాస్తుండటంతో జనం విలవిలలాడిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఏపీలో వడగాల్పుల తీవ్రత
ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న రెండు రోజులు తీవ్ర వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. సోమవారం 51 మండలాల్లో, మంగళవారం ఏకంగా 53 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో 57 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండగా, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో అత్యధికంగా 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి, నంద్యాల జిల్లాల్లో కూడా 43 డిగ్రీలకు పైగా ఎండలు కాస్తున్నాయి.
తెలంగాణలో 10 రోజుల గండం
తెలంగాణ ప్రజలకు వచ్చే 10 రోజులు గడ్డుకాలం అనే చెప్పాలి. ఈ నెల 22వ తేదీ వరకు ఎండల తీవ్రత విపరీతంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలవుతోంది. హైదరాబాద్ నగరంలో కూడా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలుల వల్ల ప్రజలు ఉక్కబోతతో సతమతమవుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి ప్రజలు మధ్యాహ్న సమయాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎండల దృష్ట్యా ప్రజలు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. ఒకవేళ వెళ్లాల్సి వస్తే.. తలకు టోపీ, గొడుగు, చలవ కళ్లద్దాలు వాడాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు మంచినీరు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలోకి రాకుండా చూడటం చాలా ముఖ్యం.
ప్రస్తుతానికి ఏప్రిల్ నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే, మే నెలలో పరిస్థితి ఊహించడానికే భయంగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత వల్ల ఉష్ణోగ్రతలు ఏటేటా పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. జూన్ రెండో వారం వరకు ఈ ఎండల నుంచి ఉపశమనం లభించే సూచనలు కనిపించడం లేదు.