Macherla: ఉరి వేసుకుందా? ఉరి తీశారా? మాచర్ల యువతి మృతి కేసులో సంచలన నిజాలు!
Macherla: మాచర్లలో దారుణం. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురినే కడతేర్చిన తండ్రి. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా.. పోస్టుమార్టం నివేదికతో అసలు నిజం బయటపడింది.
Macherla: ఉరి వేసుకుందా? ఉరి తీశారా? మాచర్ల యువతి మృతి కేసులో సంచలన నిజాలు!
Macherla: కన్నప్రేమ కరువైంది.. పరువు కోసం కన్న పేగునే తెంచుకున్నాడో తండ్రి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కన్నకూతురిని గొంతు నులిపి చంపడమే కాకుండా, ఆత్మహత్యగా చిత్రీకరించిన దారుణ ఘటన పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో కలకలం రేపింది.
ప్రేమ పెళ్లి.. పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా
మాచర్ల 22వ వార్డు యాదవ బజార్‌కు చెందిన చంద్ర శ్రీను కుమార్తె చౌడేశ్వరి, పొరుగునే ఉండే నాగరాజు అనే యువకుడిని ప్రేమించింది. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం అయినప్పటికీ, పెద్దలు ఒప్పుకోరనే భయంతో వారు ఇల్లు వదిలి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. కుమార్తె కనిపించడం లేదంటూ శ్రీను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం రోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి భారీ హంగామా సృష్టించాడు.
పెద్ద మనుషుల పంచాయితీ.. తండ్రి పక్కా ప్లాన్
పోలీసులు రంగంలోకి దిగి ప్రేమజంటను వెతికి పట్టుకుని స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పోలీసులు ఏమీ చేయలేమని చెప్పారు. పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో చౌడేశ్వరి తన భర్త నాగరాజుతోనే ఉంటానని తెగేసి చెప్పింది. అయితే, పెద్ద మనుషుల సూచన మేరకు ఐదు రోజుల పాటు చౌడేశ్వరి తండ్రి ఇంటికి వెళ్లింది. అదే ఆమెకు శాపమైంది. కూతురు తన మాట వినలేదన్న కక్షతో చంద్ర శ్రీను ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు.
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ..
మరుసటి రోజు ఉదయం చౌడేశ్వరి ఉరివేసుకుని చనిపోయిందని శ్రీను అందరికీ నమ్మబలికాడు. మనస్తాపంతోనే ఆమె తనువు చాలించిందని అందరూ భావించారు. అయితే, అనుమానం వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పోస్టుమార్టం నివేదికతో గుట్టు రట్టు
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదని, తండ్రి శ్రీను ఆమెను గొంతు నులిపి చంపాడని పోస్టుమార్టం నివేదికలో తేలింది. ఆమె కొన ఊపిరితో ఉండగానే, ఆత్మహత్యగా నమ్మించడానికి ఆమెను ఉరికి వేలాడదీశాడని సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం పోలీసులు చంద్ర శ్రీనును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరువు కోసం కన్నకూతురినే బలి తీసుకున్న తండ్రి కర్కశత్వంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.