Amaravati: వెంకన్న సాక్షిగా.. అమరావతి 'ఫ్యూచర్ సిటీ' దిశగా బాబు స్పీడ్ అప్!
Amaravati: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
Amaravati: వెంకన్న సాక్షిగా.. అమరావతి 'ఫ్యూచర్ సిటీ' దిశగా బాబు స్పీడ్ అప్!
Amaravati: అమరావతి రాజధాని నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తూ పనుల పురోగతిపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం అమరావతిలో రూ.57,821 కోట్ల విలువైన పలు పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు..
రాజధాని నిర్మాణంలో హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ అభివృద్ధి పనులు మాత్రమే కాకుండా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం కీలకంగా కొనసాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన లేదా రద్దు చేసిన పనులకు సంబంధించిన వివాదాలు, సమస్యలను పరిష్కరించి తిరిగి పనులు ప్రారంభించడంలో సీఆర్డీఏ కీలక పాత్ర పోషించిందని అధికారులు వెల్లడించారు. నిర్మాణ వ్యయాలు పెరిగినప్పటికీ, పలు సవాళ్లను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించినట్లు తెలిపారు..
ప్రస్తుతం అమరావతిలో సుమారు 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నారు. ప్రతి నిర్మాణ సంస్థ ఎంత మేరకు పనులు పూర్తి చేసిందో, టార్గెట్ ఎంతవరకు చేరుకున్నారో సీఎం స్వయంగా పనుల వారీగా సమీక్షించారు. అంతేకాకుండా, అవసరమైన మానవ వనరులు, మిషనరీ వినియోగంపై కూడా సమగ్రంగా చర్చ జరిగింది. వారం, నెల వారీగా లక్ష్యాలు నిర్ణయించుకుని పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు..
వర్షాకాలానికి ముందే పూర్తి చేయాల్సిన పనులపై అధికారులు తమ ప్రణాళికలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “రాజధాని నిర్మాణం కేవలం ఒక కాంట్రాక్ట్ పని కాదు… ఇది చరిత్రలో నిలిచిపోయే బాధ్యత” అని ఆయన పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలు ఇప్పటికే అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినప్పటికీ, ఒక రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదని అన్నారు..
అమరావతిని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని, ఈ విజన్‌ను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది నిర్మాణ సంస్థలేనని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఖర్చు తగ్గించే విధానాలను అనుసరించాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ, ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు..
రాజధాని ప్రతిష్టను పెంచే విధంగా కొత్త ఆలోచనలు ఉంటే వాటిని ప్రభుత్వంతో పంచుకోవాలని సీఎం సూచించారు. అదే సమయంలో, ప్రభుత్వం నిర్దేశించిన గడువులో పనులు పూర్తి చేయడంలో ఎలాంటి రాజీ ఉండదని కఠినంగా హెచ్చరించారు. అవసరమైతే మ్యాన్ పవర్ పెంచుకుని పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు..
అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయడంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. సమయపాలన, నాణ్యత, సాంకేతికతను సమన్వయం చేస్తూ ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ సమీక్ష సమావేశం అనంతరం అమరావతి పనులకు మరింత ఊపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..