Amaravati: అమరావతికి సొంత అడ్రస్.. వెలగపూడి పిన్ కోడ్‌కు ఇక సెలవు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ కేటాయించే ప్రక్రియ మొదలైంది. వెలగపూడి పిన్ కోడ్ నుంచి అమరావతికి సొంత గుర్తింపు రానుంది.

Update: 2026-04-04 04:29 GMT

Amaravati: అమరావతికి సొంత అడ్రస్.. వెలగపూడి పిన్ కోడ్‌కు ఇక సెలవు!

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అమరావతి ప్రాంతం అధికారికంగా వెలగపూడి పిన్ కోడ్ కిందనే కొనసాగుతోంది. అయితే, పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణలకు ఆమోదం లభించిన నేపథ్యంలో అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ కేటాయించే అవకాశం ఉందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాజధాని ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకునే దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటివరకు వెలగపూడి అడ్మినిస్ట్రేటివ్ కేంద్రంగా ఉండటంతో అదే పిన్ కోడ్ అమలులో ఉంది. కానీ అమరావతి నగరం విస్తీర్ణం, ప్రాధాన్యం, ప్రభుత్వ కార్యాలయాల పెరుగుదల దృష్ట్యా ప్రత్యేక పిన్ కోడ్ అవసరం చాలా కాలంగా వినిపిస్తున్న డిమాండ్..

పార్లమెంట్‌లో బిల్ ఆమోదం పొందిన తర్వాత తదుపరి దశ రాష్ట్రపతి ఆమోదం మరియు గెజిట్ నోటిఫికేషన్. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే భారత తపాలా విభాగం (ఇండియా పోస్ట్) అమరావతికి ప్రత్యేక పిన్ కోడ్ కేటాయించే అవకాశం ఉంది. కొత్త పిన్ కోడ్ అమల్లోకి వస్తే పరిపాలన సులభతరం కావడంతో పాటు, ప్రభుత్వ సేవలు, పోస్టల్ వ్యవస్థ మరింత వేగవంతం అవుతాయని అధికారులు భావిస్తున్నారు..

ఇంకా ఐటి కంపెనీలు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ సంస్థలు కూడా అమరావతిని ప్రత్యేక నగరంగా గుర్తించడానికి ఇది ఒక కీలక అడుగుగా మారనుంది. నగరానికి ప్రత్యేక ఐడెంటిటీ ఏర్పడటంతో రియల్ ఎస్టేట్, వ్యాపార కార్యకలాపాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.. అమరావతికి కొత్త పిన్ కోడ్ కేటాయింపు కేవలం పోస్టల్ మార్పు మాత్రమే కాకుండా, రాజధాని అభివృద్ధి దిశగా ఒక ప్రతీకాత్మక ముందడుగు. రాష్ట్రపతి గెజిట్ తర్వాత అధికారిక ప్రకటన వెలువడితే, అమరావతి మరో కొత్త గుర్తింపుతో దేశవ్యాప్తంగా నిలిచే అవకాశం ఉంది. 

Tags:    

Similar News