Mancherial: మంచిర్యాల జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం!
Mancherial: మంచిర్యాల జిల్లాలో క్యూఆర్ కోడ్ భద్రతతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం. పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం.
Mancherial: మంచిర్యాల జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం!
Mancherial: ప్రజలకు మరింత పారదర్శకంగా, అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్ కోడ్ భద్రతతో కూడిన ట్యాంపర్ ప్రూఫ్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదార హర్కర వేణుగోపాల్ రావు తెలిపారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎ.భాస్కర్, ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ తదితరులతో కలిసి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హర్కర వేణుగోపాల్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమన్నారు.
మంచిర్యాల జిల్లా అభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తున్నామని, కొత్త సాంకేతికతతో రూపొందించిన కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో తొలివిడతగా 100 మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో కొత్తగా 40,456 రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. రేషన్ కార్డు ద్వారా అర్హులైన లబ్ధిదారులు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు.
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఎలాంటి అవకతవకలు లేకుండా సంక్షేమ పథకాలు అందించేందుకు డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు ఉపయోగపడతాయని అన్నారు.
జిల్లాలో 100 మంది లబ్ధిదారులకు కార్డుల పంపిణీతో కార్యక్రమం ప్రారంభమైందని, మండలాల వారీగా పంపిణీ కొనసాగుతుందని తెలిపారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులకు పారదర్శకంగా అందించడంలో స్మార్ట్ రేషన్ కార్డులు కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు.అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.