Gudihathnoor: స్వాతంత్య్ర దినోత్సవం రోజు గుడిహత్నూర్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
Gudihathnoor: Gudihathnoor Govt School Teachers Late On August 15
Gudihathnoor: స్వాతంత్య్ర దినోత్సవం రోజు గుడిహత్నూర్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
Gudihathnoor: దేశమంతా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్లో మునిగితేలుతుంటే, గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మాత్రం ఉపాధ్యాయుల నిర్లక్ష్యం బయటపడింది. జాతీయ పండుగ రోజున కూడా కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన గురువులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులందరూ ఉదయం 7:00 గంటలకే పాఠశాలకు చేరుకోవాలని ప్రధానోపాధ్యాయుడు ముందస్తుగానే లిఖితపూర్వక నోటీసులు జారీ చేశారు.
అయితే పాఠశాలలో మొత్తం 12 మంది సిబ్బంది ఉండగా, నిర్దేశిత సమయానికి ప్రధానోపాధ్యాయుడితో కలిపి కేవలం ముగ్గురు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. మిగిలిన 9 మంది ఉపాధ్యాయులు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆలస్యంగా వచ్చారు. ఉదయం 7:30 గంటలకు పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ ర్యాలీ ప్రారంభం కాగా, కొందరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాకుండా నేరుగా ర్యాలీ మధ్యలో వచ్చి చేరారు.
మరికొందరైతే ఉదయం 8:30 గంటలకు జరగాల్సిన జెండా వందనం కార్యక్రమానికి కేవలం అరగంట ముందు మాత్రమే పాఠశాలకు చేరుకోవడం గమనార్హం.ఈ వ్యవహారంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవిదాస్‌ను వివరణ కోరగా వేడుకల నేపథ్యంలో ఉదయం 7 గంటలకే పాఠశాలలో హాజరుకావాలని సిబ్బంది అందరికీ నోటీసు ద్వారా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
జాతీయ పర్వదినం రోజున కూడా ఉపాధ్యాయులు ఇలా సమయపాలన విస్మరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కాలెక్టర్ మరియు విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి బాధ్యత మరిచిన ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.