Congress Working Presidents : నలుగురు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు.. మరి వర్క్‌ ఎక్కడ..నేతలెక్కడ?

Update: 2020-07-06 07:52 GMT

congress working presidents : మాటల తూటాలు పేల్చి, పార్టీలో ఉత్సాహం నింపుతారని ఒకరు. గ్రౌండులో పాల్‌ ఆడమ్స్‌‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడినట్టు, ప్రత్యర్థి పక్షంపై రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తారని మరొకరు. దూరమైన సామాజికవర్గాన్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారని ఇంకొకరు. పార్టీలో చెల్లాచెదురైన క్యాడర్‌ను ఒక్క చోటికి చేరుస్తారని మరొకరు. ఇలా నలుగురికీ, నాలుగు కీలకమైన పదవులిచ్చారు. కానీ నలుగురూ నలుగురే ఎవరికివారే యమునా తీరే. నలుదిక్కులా చెలరేగిపోవాల్సిన నేతలు, నిజంగానే నాలుగు దిక్కులుగా మారి, పార్టీకి దిక్కు లేకుండా చేస్తున్నారట. నలుగురిలో ఒక్కరు తప్ప, మిగతా ముగ్గురూ ఉన్నామంటే ఉన్నారట. ఇంతకీ ఏదా పార్టీ ఎవరా నలుగురు?

రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, కుసుమ్ కుమార్, ఈ నలుగురు నాయకులు, తెలంగాణ కాంగ్రెస్‌కు ఒకరకంగా నాలుగు స్తంభాలు ఎందుకంటే, నలుగురూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్స్. పార్టీని రాష్ట్ర నలుదిక్కులా పరుగులు పెట్టించాల్సిన నాలుగు గుర్రాలు. కానీ నలుగురూ నాలుగు దిక్కులుగా మారి, కాంగ్రెస్‌‌‌‌కు దిక్కులేకుండా చేస్తున్నారన్న విమర్శలు వినపడ్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జంబో వర్కింగ్ కమిటీ వీరంతా. పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డితోపాటు, నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించింది అధిష్టానం. కీలక సామాజికవర్గ నేతలకు ప్రాధాన్యం కల్పిస్తూ నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను ప్రకటించింది. అట్టహాసంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు తీసుకున్న లీడర్లు, అడ్రస్ లేరు, ఒక్క రేవంత్‌ రెడ్డి తప్ప.

నలుగురిలో కేవలం రేవంత్ రెడ్డి మినహా మిగతా ముగ్గురు వర్కింగ్ పెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కుసుం కుమార్ పేరుకు మాత్రమే ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి మాత్రం సొంతంగా కార్యక్రమాలు రూపొందించుకుంటూ రాష్ట్రంలో పర్యటిస్తుంటారు. మిగతా వాళ్లు మాత్రం కేవలం పార్టీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ హోదాను అనుభవించడానికే ఉన్నారు తప్ప, పదవికి తగ్గట్టు పార్టీలో క్రియాశీలకంగా లేరన్న మాటలు వినిపిస్తున్నాయి.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కేవలం ఆయన కరీంనగర్ పార్లమెంట్ కు పరిమితమయ్యారట. అక్కడి పార్టీ కార్యక్రమాలకే హాజరవుతున్నారట. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మిగతా జిల్లాల వైపు అసలు కన్నెత్తి కూడా చూడటం లేదట. వాగ్దాటి వున్న నాయకుడు కాబట్టి, ఎవరైనా పిలిచినా, వారి ఏరియాలో తనకేం పని అన్నట్టుగా తల తిప్పుకుని పోతున్నారట పొన్నం.

ఇక మిగతా ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు అజారుద్దిన్, కుసుమ్ కుమార్‌లు. వీరసలు పార్టీ ప్రోగ్రామ్‌లకే అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. టీం ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ అయితే, అసలు కాంగ్రెస్‌లో వున్నాడో లేదో క్యాడర్‌కే అర్థంకావడం లేదట. ఆయన పార్టీ కార్యక్రమాల్లో కనపడింది లేదు. ఎలాంటి ఆందోళనా కార్యక్రమాల్లోనూ పార్టిసిపేట్ చెయ్యారు. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో ఎంఐఎంకి దీటుగా పార్టీని బలోపేతం చేేేసే దిశగా అసలు ఆలోచించడం లేదట అజర్. సెలబ్రిటీగా, చుట్టపుచూపుగానూ పార్టీ కార్యక్రమాల్లో కనపడటం లేదు అజర్. ఎప్పుడైతే ఆ‍యన హైదరాబాద్‌ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడయ్యాడో, అప్పటి నుంచి గాంధీభవన్‌ వైపు చూడ్డానికే ఇష్టంపడటం లేదన్న చర్చ జరుగుతోంది. ఆయన కారెక్కుతారన్న ప్రచారమూ సాగుతోంది. కాంగ్రెస్‌లో చురుగ్గా లేకపోవడంతో, మాజీ కెప్టెన్‌పై రకరకాల ఊహాగానాలకు ఆస్కారం ఏర్పడుతోంది.

ఇక కుసుమ్‌ కుమార్. పార్టీలో కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వెనకబడ్డారీయన. గాంధీభవన్‌కు అప్పుడప్పుడు వస్తున్నా, బయటి ప్రాంతాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల్లో కనపడరట. హాయ్‌ బాయ్‌ అంటూ, కాసేపు తన క్యాబిన్‌లో కూర్చుని వెళ్లిపోతారని కుసుమ్‌ కుమార్ గురించి చెప్పుకుంటున్నారు గాంధీభవన్ కార్యకర్తలు.

ఇదీ నలుగురి కథ. పార్టీలో కీలక పదవులు రాక, కాంగ్రెస్ సీనియర్లు అల్లాడిపోతుంటే, వీరికి కీలకమైన బాధ్యతలు అప్పగించినా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. నలుగరిలో రేవంత్‌ రెడ్డి తప్ప, మిగతా ముగ్గురూ ఎవరికివారే అన్నట్టుగా తయారయ్యారు. ఇలాగైతే పార్టీని బలోపేతం చెయ్యడం ఎలాగో, టీఆర్ఎస్‌ను దీటుగా ఎదుర్కొనేదెలాగో కార్యకర్తలకు బోధపడ్డం లేదట.


Full View


Tags:    

Similar News