ఆ ఇద్దరు ఎమ్మెల్యేల కరోనా దోస్తానాపై ఇంట్రెస్టింగ్‌ చర్చేంటి?

ఒకరు క్లాస్ నేత. మరొకరు మాస్ లీడర్. ఒకరు సీనియర్. మరొకరు జూనియర్.

Update: 2020-06-23 06:39 GMT

ఒకరు క్లాస్ నేత. మరొకరు మాస్ లీడర్. ఒకరు సీనియర్. మరొకరు జూనియర్. పక్క పక్కన అంటుకుని ఉండే నియోజకవర్గాలకు వాళ్లు ఎమ్మెల్యేలు. కొన్నాళ్ల పాటు ఇద్దరి మధ్య పూడ్చుకోలేనంత గ్యాప్. కానీ ఇప్పుడు ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకేంతగా స్నేహం ఎలా పెరిగింది..? ఆ ఇద్దరు ఎమ్మెల్యేల కరోనా దోస్తానీపై.. ఇందూరు జరుగుతున్న చర్చలో నిజమెంత..? మరో ఎమ్మెల్యేను దెబ్బకొట్టేందుకు చేతులు కలిపారనే ప్రచారంలో వాస్తవం ఉందా..? కరోనా ఆ ఇద్దరి బంధాన్ని మరింత బలపరిచిందా? కానీ ఇప్పుడు వీరి మధ్య స్నేహం బలపడింది...వైరస్‌తో పెనవేసుకునేంతగా ఫ్రెండ్‌షిప్‌ అల్లుకుంది....ఆ పాత ప్రతీకారాలు అలానే వుంటే, అసలు వైరస్‌ దూరేంత గ్యాప్‌ వుండేదికాదన్న ఇంట్రెస్టింగ్‌ చర్చ, ఇందూరులో జరుగుతోంది.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా - రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు.. కరోనా నిర్ధారణ అయ్యింది. రూరల్ ఎమ్మెల్యేతో కాంటాక్టులో భాగంగా.. అర్బన్ ఎమ్మెల్యేకు వైరస్ సోకింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ ఇద్దరి మధ్య స్నేహ బంధం వైరస్ అంటించుకునే స్థాయికి ఎలా పెరిగిందన్నది, ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ హాట్ గా జరుగుతున్న చర్చ. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాస్ లీడర్ గా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక వరుసగా రెండుసార్లు విజయం సాధించి, మిస్టర్ కూల్ గా గుర్తింపు పొందిన అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు క్లాస్ లీడర్ గా ప్రజల్లో మంచి పేరుంది. ఐతే రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మధ్య కొంతకాలం క్రితం వరకు, ఉప్పు- నిప్పులా పూడ్చుకోలేనంత గ్యాప్ ఉండేదట. ఏమాత్రం ఇద్దరికీ పడేదికాదట.

మంత్రి పదవి కోసం ఇద్దరూ తమదైన శైలిలో ప్రయత్నాలు చేసిన వారే. రూరల్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు అర్బన్‌లో కలిసి ఉండటం, నియోజకవర్గాలు పక్కపక్కనే ఉండటంతో, చిన్నచిన్న విషయాల్లో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడిన సందర్భాలు ఉన్నాయట. అర్బన్‌లో రూరల్ ఎమ్మెల్యే జోక్యం ఏంటన్న వాదనలు సైతం జరిగాయట. ఒక దశలో అర్బన్‌లో రూరల్ ఎమ్మెల్యే ఫ్లెక్సీ కనిపించినా, రూరల్‌లో అర్భన్‌ ఎమ్మెల్యే బొమ్మ కనపడినా, ఇద్దరూ ఫైర్‌ అయ్యేవారట. ఇలా ఉప్పు-నిప్పులా ఉండే ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు ఫెవీక్విక్ బంధంలా విడదీయరాని స్నేహం ఏర్పడిందట.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే- అర్బన్ ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఎన్నికల ముందు వరకు గ్యాప్ ఉండేదట. పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇద్దరి మధ్య దోస్తానీ బాగా పెరిగిందట. ఒకే పార్టీలో దాదాపుగా ప్రత్యర్థులుగా మెలిగిన ఇద్దరి మధ్యా, స్నేహం చిగురించడానికి కారణం, జిల్లా మంత్రిని ఒంటరి చెయ్యాలన్న ఆలోచనేనన్న చర్చ వుంది. అలా ఒకరిని అలోన్ చేసేందుకు, ఇద్దరూ చెయ్యి చెయ్యి కలిపారట. అది కాస్తా అభిమానులను ఆందోళనకు గురి చేసే మరో సమస్యకు దారి తీసిందట.

ఓ దశలో మంత్రి ఏర్పాటు చేసిన విందుకు మాట్లాడుకుని మరీ... డుమ్మా కొట్టారని పార్టీలో అప్పట్లో టాక్ నడిచింది. వీరితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ఆ పార్టీకి వెళ్లకుండా ఆపేశారట. ఇలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించడంతో, మొన్నటి మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీని కూడా సజావుగా సాగేలా చూశారట. తన అనుచరులకు అర్బన్ లో టికెట్లు ఇప్పించుకున్నారట రూరల్ ఎమ్మెల్యే. ఇలా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎడముఖం- పెడముఖంలా ఉన్న ఆ ఇద్దరు, ఒకరి నుంచి మరొకరికి కరోనా అంటించుకునేంతలా ఇప్పుడు దోస్తానీ బలపడిందట. కొద్ది రోజులుగా ఇద్దరు సన్నిహితంగా తిరగడం, కలసి డిన్నర్ చేయడంతో రూరల్ ఎమ్మెల్యే కాంటాక్టుతో.. అర్బన్ ఎమ్మెల్యేకు వైరస్ వచ్చిందట. ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం గులాబీ పార్టీలో పెద్ద చర్చకే దారితీసిందట.

ఒక్కరిని ఒంటరి చేసేందుకు నలుగురు చేతులు కలిపితే.. ఆ నలుగురి ఎమ్మెల్యేల్లో సొసైటీ ఎన్నిక పెట్టిన చిచ్చుతో.. ఇద్దరి మధ్య బంధం బలపడిందట. రాబోయే ఎన్నికల్లో అర్బన్ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న సదరు ఎమ్మెల్యేకు ఈ దోస్తానీ కలిసొస్తుందా లేదా అన్న చర్చకు ముగింపు ఎలా ఉంటుందో వేచిచూడాలి. 


Full View


Tags:    

Similar News