Ponguleti Srinivas Reddy: పొంగులేటి పయనమెటు..?.. రెండు జాతీయ పార్టీల నుంచి పిలుపు..
Ponguleti Srinivas Reddy: పొంగులేటి దారెటు.. ఇప్పుడు ఖమ్మం పాలిటిక్స్‌లో ఈ టాపిక్ హాట్‌గా మారింది.
Ponguleti Srinivas Reddy: పొంగులేటి పయనమెటు..?.. రెండు జాతీయ పార్టీల నుంచి పిలుపు..
Ponguleti Srinivas Reddy: పొంగులేటి దారెటు.. ఇప్పుడు ఖమ్మం పాలిటిక్స్‌లో ఈ టాపిక్ హాట్‌గా మారింది. బీఆర్ఎస్‌పై ధిక్కార స్వరం వినిపించి సొంత సమ్మేళనాలతో హోరెత్తిస్తున్న పొంగులేటి.. ఏ పార్టీలో చేరతారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జాతీయ పార్టీల నుంచి ఆహ్వానం అందిందని కూడా తెలుస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీల్లో ఏ గూటిని తాను ఎంచుకుంటారనేది చర్చనీయంగా మారింది.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ నేత. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో అధికార బిఆర్ఎస్ పార్టీలో పొంగులేటి చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి వెనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నారని అధినేత కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీనితో 2019 లోక్ సభ ఎన్నికల్లో పొంగులేటిని కాదని ఖమ్మం ఎంపీ స్థానాన్ని నామా నాగేశ్వరరావుకు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి పొంగులేటి ఏ పదవీ లేకుండా బిఆర్ఎస్ లో కొనసాగారు.
తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించారు. అంతేకాకుండా తన అనుచరవర్గంతో నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాలతో పొంగులేటిపై బీఆర్ఎస్‌లో వేటు కూడా పడింది. దీంతో పొంగులేటికి గాలం వేస్తున్నాయి జాతీయ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఇప్పటికే ఆఫర్లు కూడా వెళ్లాయి.
ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్ పొంగులేటితో చర్చలు జరిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచర వర్గానికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే మాజీ ఎంపీ పొంగులేటి మాత్రం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వున్న పది అసెంబ్లీ స్థానాల్లో ఒక్క మధిర నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరినట్టు తెలిసింది. మరోవైపు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కూడా తన వర్గానికి ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారనే చర్చ జరుగుతోంది. అయితే పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటుగా రేణుకా చౌదరి అభ్యంతరం తెలుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇక పొంగులేటికి బీజేపీ సైతం గాలం వేస్తోంది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో బీజేపీలో చేరితే రాజకీయంగా అండ లభిస్తుందని పొంగులేటి భావిస్తున్నారు. ఒక వేళ బీజేపీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ సాధించకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకోవచ్చని పొంగులేటి ఆలోచనగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.