అందులో నిజముందా..? వీహెచ్, సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ

V Hanumantha Rao: కాంగ్రెస్‌ పార్టీలో ఆయనో సీనియర్‌ నేత. పార్టీని, పార్టీలోని వ్యక్తులను ఎవరైనా తిడితే అస్సలు ఊరుకోరు.

Update: 2022-02-22 12:43 GMT

అందులో నిజముందా..? వీహెచ్, సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ

V Hanumantha Rao: కాంగ్రెస్‌ పార్టీలో ఆయనో సీనియర్‌ నేత. పార్టీని, పార్టీలోని వ్యక్తులను ఎవరైనా తిడితే అస్సలు ఊరుకోరు. అలాంటి వారెవరైనా సరే.. అగ్గిమీద గుగ్గిలం అవుతారు. అలాంటి వీహెచ్‌కు ఇప్పుడు ఓ తలనొప్పి వచ్చి పడింది. వీహెచ్ టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నట్టు ఉన్న ఓ ఫొటో.. గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని వీహెచ్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఫోటో చేత పట్టుకొని అన్ని పోలీస్‌ స్టేషన్లలో కంప్లయింట్‌ ఇస్తున్నారు.

వీహెచ్‌ పార్టీ మారినట్లు ఓ ఫొటోను మార్ఫింగ్‌ చేశారు దుండగులు. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో నెట్టింట్‌ ఆ పిక్‌ వైరల్ ‌అయింది. కాంగ్రెస్‌ను తిడితేనే భరించలేని వీహెచ్ తాను పార్టీ మారినట్టు, అధికార పార్టీ కండువా కప్పుకున్నట్టు వైరల్‌ అవుతున్న ఫొటోను భరించలేకపోతున్నారు. ఆ ఫొటోను తీసుకొని, జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అక్కడి పోలీసులు పట్టించుకోకపోవడంతో హల్‌చల్‌ చేశారు. ఎందుకు కంప్లయింట్‌ తీసుకోరంటూ సీఐపై కన్నెర్ర చేశారు.

ఆ తర్వాత మళ్లీ అదే ఫొటోతో నాంపల్లిలోని సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారంపై చర్యలు ఎందుకు తీసుకోరంటూ అక్కడున్నవారిని కడిగిపరేశారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన సీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన వీహెచ్ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు ఏ విధంగా అయితే ఉక్కుపాదం మోపుతున్నారో సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇక ఇదే సమయంలో సీపీ, వీహెచ్‌ మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. అసలు నాపై నా పార్టీ వాళ్లే అసత్య ప్రచారం చేస్తున్నారా..? లేక వేరే పార్టీవాళ్లు చేయిస్తున్నారో తెలియడంలేదని వీహెచ్‌ చెప్పిన మాటలు అక్కడున్నవారికి టక్కున నవ్వు తెప్పించాయి. ఇప్పుడు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ అక్కడున్న వారితో పాటు చూస్తున్నవారికి నవ్వు తెప్పిస్తోంది.

Tags:    

Similar News