టీఎస్ఆర్టీసీ సంచలన నిర్ణయం..17వేల మంది కార్మికులు ఇంటికి?

TSRTC: అసలే వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని కరోనా మరింత కుంగదీసింది.

Update: 2021-09-03 12:04 GMT

టీఎస్ఆర్టీసీ సంచలనం నిర్ణయం..17వేల మంది కార్మికులు ఇంటికి?

TSRTC: అసలే వేల కోట్ల రూపాయల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ ఆర్టీసీని కరోనా మరింత కుంగదీసింది. నెలల పాటు బస్సులు డిపోల్లో నుంచి కదలక సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకుంది. దీంతో ఆర్టీసీని గట్టెక్కించేందుకు సంస్కరణలను ప్రవేశపెట్టడమే పరిష్కారమని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులను తగ్గించుకోవాలని సంస్థ యాజమాన్యం సమాలోచనలు చేస్తున్నట్లు ఆర్టీసీ వర్గాల్లో చర్చ జోరుగా జరుగుతోంది.

తెలంగాణ ఆర్టీసీలో నష్టాల్ని తగ్గించడానికి సరికొత్త సంస్కరణలు ముందుకు తీసుకువస్తుంది. సంస్థకు చెందిన ఉద్యోగుల్లో దాదాపు 17వేల మందిని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ వీఆర్‌ఎస్, తప్పనిసరి ఉద్యోగ విరమణ సీఆర్‌ఎస్ ద్వారా ఇంటికి పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంస్కరణల అమలు కోసమే సమర్థుడైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి వీసీ సజ్జనార్‌ను ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నియమించిందన్న ప్రచారం జరుగుతోంది. సజ్జనార్‌కు ఇచ్చిన తొలి టాస్క్ వీలైనంత మంది ఉద్యోగులకు ఇంటికి పంపించడమేనని టాక్.

ఆర్టీసీలో ప్రస్తుతం 49,250 మంది వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. ఇందులో 18,432 మంది డ్రైవర్లు 20,229 మంది కండక్టర్‌లు ఉన్నారు. అయితే ఇప్పుడు రోడ్డెక్కుతున్న బస్సులకన్నా అందుబాటులో ఉన్న సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. మొత్తం 9,184 బస్సుల్లో కాలం చెల్లిన కారణంగా దశలవారీగా ఇప్పటివరకు 3250కి పైగా బస్సులను ఆర్టీసీ ఉపసంహరించింది. ఈ బస్సుల్లో పని చేయాల్సిన డ్రైవర్లు ఖాళీగా ఉంటున్నారు. మరోవైపు చాలా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో టిమ్స్‌ను వినియోగిస్తుండటంతో కండక్టర్ల అవసరం లేకుండా పోయింది. దీంతో మిగులుగా పరిగణించిన ఆ ఉద్యోగులనే వీఆర్‌ఎస్‌, సీఆర్‌ఎస్‌ పథకాలతో ఇంటికి పంపించే అంశంపై ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఆర్టీసీలో వీఆర్‌ఎస్‌ ద్వారా 58 ఏళ్లు నిండిన 6064 మందిని ఇంటికి పంపించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సాధారణ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌తో వారిందరి అకౌంట్స్‌ సెటిల్‌ చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికే వీఆర్‌ఎస్, సీఆర్‌ఎస్ తీసుకువస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బస్సు చక్రం ప్రగతికి రథ చక్రం అంటారు. ఆర్టీసీ ఆర్థిక నష్టాల్లో ఉందని లాభాల పేరుతో ప్రజా రవాణాని నిర్వీర్యం చేయడం ప్రభుత్వాలకు తగదు. ఆర్టీసిపై డీజిల్ భారం తగ్గిస్తే మళ్ళీ మాములు స్థితికి వచ్చే అవకాశం ఉంది.

Full View


Tags:    

Similar News