బీఆర్ఎస్ మహిళా నేతల కోల్డ్ వార్: దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో అంతర్గత విబేధాలు

బిఆర్ఎస్ పార్టీలో మహిళా నేతల మధ్య కొత్త పంచాయతీమొదలయిందా...దీక్షా దివస్ సాక్షిగా మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడిందా..

Update: 2025-12-05 08:00 GMT

బీఆర్ఎస్ మహిళా నేతల కోల్డ్ వార్: దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్‌లో అంతర్గత విబేధాలు

బిఆర్ఎస్ పార్టీలో మహిళా నేతల మధ్య కొత్త పంచాయతీమొదలయిందా...దీక్షా దివస్ సాక్షిగా మహిళా నేతల మధ్య ఆధిపత్య పోరు బయటపడిందా.. ఇంతకు మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారు... గులాబీ అధిష్టానం మహిళా నేతలను పిలిచి మాట్లాడిందా..ఇంతకు బిఆర్ఎస్ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది.


బీఆర్ఎస్‌ మహిళా లీడర్ల మధ్య.. కొత్త పంచాయితీ షురూ అయిందట. పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నం.. ఐనా మాకు ప్రాధాన్యత లేదు. కానీ నిన్న మొన్న వచ్చిన వారికి పార్టీలో ప్రియార్టీ ఇవ్వడం ఏంటి..? ఇలా అయితే మా రాజకీయ భవిష్యత్తు ఏంటన్న గళాలు వినిపిస్తున్నాయట మహిళా నేతల్లో. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కోల్డ్ వార్ ఒక్కసారిగా దీక్షా దివస్ సాక్షిగా బయటపడింది. పార్టీ పదవులపై మహిళా నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వరకు వెళ్ళడంతో హాట్ టాపిక్ అయింది. దీంతో ఈ విషయం అధిష్టానం వరకు వెళ్ళింది. ప్రతి రోజు ఒక పోస్ట్ పెడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రస్తావన మొదలు.. తెలంగాణ వచ్చే వరకు తాము ఉద్యమంలో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు..


దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ భవన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ భవన్ వేదికగానే మహిళా నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. సరైన సమయం కోసం వేచి చూసిన మహిళా నేతలు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ మహిళా నేతలను కాదని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పావని గౌడ్ కు మైక్ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. ఇక పావని గౌడ్ ను ఉద్యమ నాయకురాలిగా పరిచయం చేయడం మిగిలిన మహిళా నేతలకు ఇబ్బందిగా మారింది.


ఇక దీక్షా దివస్ సందర్భంగా జరిగిన పరిణామాలతో సీనియర్ మహిళా నేతలు నొచ్చుకున్నారట. గతంలో తాము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భాలను గుర్తు చేస్తూ సుమిత్రానంద్, శ్రీదేవి, సుశీలా రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇది కాస్త గులాబీ అధిష్టానం దృష్టికి వెళ్ళిందట. దీంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళా నేతలను పిలిచి మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టారు అనే దానిపై ఆరా తీసినట్లుగా తెలిసింది. ఉద్యమ కాలం నుంచి తాము పార్టీలో ఉంటే కొత్తగా వచ్చిన వాళ్లకు ప్రయారిటీ ఎట్లా ఇస్తున్నారని కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారట. పార్టీలో మహిళా విభాగం అధ్యక్షురాలు,కమిటీ లేకపోవడం లాంటి అంశాలు మహిళా నేతలు చెప్పగా త్వరలో ఏర్పాటు చేసి పార్టీ రాష్ట్ర కమిటీలో, మహిళా కమిటీల్లో ఉద్యమ సమయం నుంచి ఉన్న మహిళా నేతలకు ప్రయారిటీ ఇస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లుగా గులాబీ పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కేటీఆర్ హామీ ఇచ్చిన తరువాత కూడా సోషల్ మీడియా లో పోస్ట్ లు మాత్రం ఆగడం లేదట.


మొత్తానికి గులాబీ పార్టీ మహిళా నేతల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ ను అధిష్టానం ఏ విధంగా పరిష్కారం చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News