ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతికి ఫిర్యాదు

Update: 2019-07-01 10:08 GMT

తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రపతిని కలిశారు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యల అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తెలిపారు. ఇంటర్ పరీక్షలకు 9 లక్షల మంది హాజరైతే 3 లక్షల మంది ఫెయిల్‌ అయ్యారని, 27 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇంటర్ బోర్డు తప్పిదాల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారని లక్ష్మణ్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో 27 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం వారి కుటుంబాలను పట్టించుకోలేదన్నారు. ఫలితాల అవకతవకలకు కారణమైన గ్లోబరినా సంస్థపై చర్యలు తీసుకోకుండా మళ్లీ ఆ సంస్థకే రీ వెరిఫికేషన్‌ ప్రాజెక్టు ఇవ్వడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. నిన్న హోంమంత్రి అమిత్ షా ని కలిసి దీనిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. నేడు రాష్ట్రపతిని కూడా కలిసి వినతిపత్రం అందజేశామని లక్ష్మణ్‌ వివరించారు. ఈ అంశంపై నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Tags:    

Similar News