ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు

MLC Posts: తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆరెస్‌లో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Update: 2021-11-03 06:33 GMT

ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావాహుల ఎదురుచూపులు

MLC Posts: తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆరెస్‌లో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన సీనియర్లు మరోసారి రెన్యువల్ చేసుకునేందుకు సిద్ధమవుతుంటే కొత్తగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కోసం గులాబీ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్‌ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. పదవీకాలం పూర్తైన ఆరుగురిలో ఒకరిద్దరికి మాత్రమే రెన్యువల్ అయ్యే ఛాన్స్ ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రెన్యువల్ ఖాయమన్న ప్రచారం జరుగుతుంది. నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావుకు ఇప్పటికే ఒకసారి రెన్యువల్ చేసినందున ఈసారి అవకాశం లేదంటున్నాయి పార్టీ వర్గాలు.

నాగార్జునసాగర్ బై ఎలక్షన్స్ సమయంలో నల్గొండ నుండి ఎంసీ కోటిరెడ్డికి కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఎంతవరకు అవకాశం ఉందో చూడాలంటున్నారు పార్టీ నేతలు. మరో సీనియర్ నేత కడియం శ్రీహరితో పాటు ఫారీదుద్దీన్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆకుల లలితకు రెన్యువల్ చేస్తారా అనే సందేహం నెలకొంది. వరంగల్ జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు రెన్యూవల్ కాకపోతే ఆ జిల్లా నుంచి మరో సీనియర్ లీడర్ కు ఛాన్స్ దక్కనుంది.

ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉంది.

ఇక ఈ మధ్య పలువురు సీనియర్ నేతలు ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్‌లో చేరారు. వీరిలో ఎల్ రమణ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు లాంటి సీనియర్ నేతలు పార్టీలో చేరడంతో ఎమ్మెల్సీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా చేరిన వారిలో ఒకరిద్దరికి గులాబీ బాస్ సముచిత స్థానం ఇస్తామని కూడా ప్రకటించడంతో ఎమ్మెల్సీ రేసులో వీరి పేర్లు కూడా ఉన్నారు. మరి కేసీఆర్‌ ఎవరికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టానున్నారో వెయిట్‌ ఎండ్ సీ.

Tags:    

Similar News