Telangana: తెలంగాణలో జోరుగా అధికారుల బదిలీలు
Telangana: ఒకే శాఖలో ఏళ్లుగా తిష్టవేసిన వారిపై బదిలీ వేటు
Telangana: తెలంగాణలో జోరుగా అధికారుల బదిలీలు
Telangana: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చకచకా అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఒకే శాఖలో చాలా ఏళ్లుగా తిష్టవేసి అధికారులను బదిలీ వేటు వేస్తున్నారు. మరి కొంతమందికి ప్రమోషన్స్ ఇస్తూ స్థానం చలనం కల్గిస్తోంది ప్రభుత్వం. గత ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన ఉన్నతాధికారులను అ ప్రాధాన్యత కల్గిన శాఖలకు బదిలీ చేస్తున్నారు. ఐఏఎస్‌తో పాటు ఐపీఏస్ ల బదిలీలు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. తాజాగా రాష్టంలో 20 మంది ఐపీఎస్ అధికారులు, 14 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. మరికొంతమంది ప్రమోషన్స్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీజీపీగా రవిగుప్తకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మాజీ డీజీపీ అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డీజీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్‌ను ఏసీబీ డీజీగా బదిలీ చేశారు. రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ అయ్యారు. అభిలాష్ బిస్తాను అడిషనల్ డీజీగా తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ చేసింది ప్రభుత్వం. సౌమ్య మిశ్రా జైళ్ళ శాఖ అడిషనల్ డీజీగా బదిలీ అయ్యారు. ఉమెన్స్ సేఫ్టీలో ఉన్న షికా గోయల్‌ను సీఐడీ అడిషనల్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీగా బదిలీ అయ్యారు. ఇంటిలీజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డీజీగా బదిలీ చేశారు.
ఐఏఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2015 బ్యాచ్ ఐఏఎస్ లకు పదోన్నతులు కల్పిచింది సర్కార్. 14 మంది అధికారులకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ కల్పించారు. 2024 జనవరి 1 నుంచి పదోన్నతి అమల్లోకి రానుంది. ప్రమోషన్ పొందిన వారిలో పమేలా సత్పతి, అనురాగ్ జయంతి, గౌతమ్ పాత్రు, రాహుల్ రాజ్, భావేష్ మిశ్రా, సత్య శారదాదేవి, నారాయణ రెడ్డి, ఎస్. హరీష్, జి. రవి, కె. నిఖిల, అయేషా మష్రత్ ఖానమ్, సంగీత సత్యనారాయణ, యాసీన్ బాషా, వెంకట్రావ్ ఉన్నారు.
పాలనలో మార్పులు తీసుకురావడానికి భారీగా అధికారుల బదిలీలు చేపడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సర్వీస్‌లో మంచి గుర్తింపు పొందిన, ఎలాంటి ఆరోపణలు లేని ఆఫీసర్లకు పదోన్నతుల ఇస్తూ కీలక శాఖల్లో నియమిస్తోంది సర్కార్. అలాగే ఇప్పటి వరకు బదిలీలు జరగని వారిని ఏ శాఖకు బదిలీ చేయబోతున్నారనే చర్చ జరుగుతోంది.