కరోనా, వరదలతో కళ తప్పిన బతుకమ్మ, దసరా

బతుకమ్మ, దసరా తెలంగాణలో అన్ని పండుగలకంటే పెద్ద పండగలు‌‌‌‌. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకూ ప్రతిరోజు బతుకమ్మ ఆటలు, పాటలతో సంబురంగా సాగే నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కరోనా దెబ్బకు కళ తప్పాయి.

Update: 2020-10-23 16:18 GMT

బతుకమ్మ, దసరా తెలంగాణలో అన్ని పండుగలకంటే పెద్ద పండగలు‌‌‌‌. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకూ ప్రతిరోజు బతుకమ్మ ఆటలు, పాటలతో సంబురంగా సాగే నవరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది కరోనా దెబ్బకు కళ తప్పాయి. కోవిడ్ కు తోడు వర్షాలు, వరదలతో పండుగవాతావరణమే కనిపించడంలేదు. ప్రయాణికులకోసం ప్రత్యేక బస్సులు, రైళ్లను వేసినా సొంతూళ్లకు వెళ్లేవాళ్లే కరువయ్యారు.

దసరా వచ్చిందంటే పది రోజుల ముందే నగరంలో ఉన్నవాళ్లు ఊర్లకు, పల్లెల్లో ఉన్నవాళ్లు నగరాలకు చేరుకునేవాళ్లు. దాదాపు 20 లక్షలకు పైగా ప్రజలు సొంతూర్లకు బయలుదేరేవారు. ఇక ఇతర రాష్ట్రాల్లో ఉండేవారు, వేరే దేశాల్లో ఉండే వారు కూడా పండుగ కోసమే ప్రత్యేకంగా వచ్చేవాళ్లు. కానీ ఈసారి మాత్రం ఇందులో సగం మంది కూడా సొంతూర్లకు వెళ్లే పరిస్థితి కనిపించడంలేదు.

కరోనా సృష్టించిన కల్లోలం నుంచి అన్‌‌‌‌లాక్‌‌‌‌లతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలోనే భారీ వర్షాలు, వరదలో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. వరదలకు భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించగా.. పూర్తిగా నీట మునిగిన పంటలతో రైతన్నల ఇంట కన్నీరు మాత్రమే మిగిలింది. దీంతో దసరా జోష్ కనుచూపుమేర కనిపించడంలేదు.

మరోవైపు పండగ కోసం దాదాపు 100 ప్రత్యేక రైళ్ళు‌‌‌ నడుస్తున్నాయి. అయితే రైళ్లలో రద్దీ మాత్రం అంతగా లేదనే చెప్పాలి. అటు ఆర్టీసీకి రోజుకు రూ.5 కోట్ల కలెక్షన్‌‌‌‌ మాత్రమే వస్తోంది. జిల్లాల్లో 52శాతం, సిటీలో 40 శాతం ఆక్యుపెన్సీ రేషియో రికార్డవుతోంది. ఇటు పండగ కోసం 3 వేల ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నా అందుకు తగిన విధంగా ప్రయాణికుల నుండి పెద్దగా స్పందన రావడం లేదు.

 అటు కరోనా.. ఇటు వరదలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో నగర వాసులు పండగలకు ఆసక్తి చూపించడం లేదు. ఇంకా పలు కాలనీలు నీళ్లలోనే ఉండడం.. దాచుకున్న కష్టార్జితం నీటి పాలవ్వడంతో భాగ్యనగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కన్నీటి ఛాయలే కనిపిస్తున్నాయి

Tags:    

Similar News