Fee Reimbursement: తెలంగాణలో కొనసాగుతున్న కాలేజీల బంద్
Fee Reimbursement: తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు.
Fee Reimbursement: తెలంగాణలో కొనసాగుతున్న కాలేజీల బంద్
Fee Reimbursement: తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల బంద్ కొనసాగుతుంది. ప్రభుత్వంతో చర్చల ప్రక్రియ కొనసాగినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటూ ప్రభుత్వం అటూ ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు పట్టువీడకపోవడంతో అర్ధాంతరంగా చర్చలు ముగిశాయి. మరో వైపు ఆందోళనను ఉధృతం చేసేందుకు ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలు బంద్ పాటిస్తున్నాయి. 2వేలకు పైగా వృత్తివిద్యా కాలేజీలతో పాటు పీజీ, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. కీలకమైన సెమిస్టర్ పరీక్షలను సైతం మెజార్టీ కాలేజీలు బహిష్కరించాయి. గత నాలుగు రోజులుగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల్లో యాబై శాతం నిధులు ఇస్తే కానీ సమ్మె విరమించే ప్రశ్న లేదని స్పష్టం చేశాయి. మంగళవారం ప్రభుత్వం చర్చలకు పిలిచింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోవడంతో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించాయి. ఈనెల 8న ఎల్బీ స్టేడియంలో దాదాపు 30 వేల మంది అధ్యాపకులతో సాంత్వన సభ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఫీజు రియింబర్స్ మెంట్ సంస్కరణల కోసం ప్రభుత్వం పదిహేను మందితో కమిటీ వేయడానికి ఫాతి స్వాగతించింది. కానీ అందులో ఉన్న సభ్యులపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కమిటీలో వేయడం అంటే కాలయాపన కోసమే అని ఉన్నత విద్యాసంస్థల ఫెడరేషన్ సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా కమిటీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. సాంకేతిక విద్య కమిషనర్ దేవసేనపై సమాఖ్య సభ్యులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బంద్ పాటిస్తున్న కళాశాలలను దేవసేన బెదిరిస్తున్నారని.. ఆమెను విద్యాశాఖ నుంచి బదిలీ చేయాలని కోరారు. దేవసేన యూజ్ లెస్ కాలేజస్ అంటూ చేసిన వ్యాఖ్యాలను సమాఖ్య తప్పుపడుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 వేలకు పైగా కళాశాలలకు.. 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని....ఇందులో 50 శాతం అంటే....5 వేల కోట్లు ఇవ్వాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశాయి. అంతే కాదూ ప్రభుత్వం అప్పటికి దిగి రాకపోతే...10 లక్షల మంది విద్యార్థులతో ఈనెల 11 నగర శివారులోని చలో హైదరాబాద్ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించి...తమ నిరసనను తెలియజేసేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠ కొనసాగుతోంది.