KTR: కాంగ్రెస్‌కు ఓటేస్తే మునిగిపోవడం ఖాయం! రూ.4 వేల పింఛన్ ఇస్తేనే వాళ్లకు ఓటేయండి.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

KTR: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. భూపాలపల్లి మరియు పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్డు షోలలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Update: 2026-02-09 09:26 GMT

KTR: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. భూపాలపల్లి మరియు పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్డు షోలలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, కుంభకోణాలు మాత్రం రాజ్యమేలుతున్నాయని ఆయన ఆరోపించారు.

సింగరేణిలో భారీ కుంభకోణం?

భూపాలపల్లి గడ్డపై నిలబడి సింగరేణి సంస్థ గురించి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు."సింగరేణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది కలిసి దోచుకుంటున్నారు. టెండర్ల పేరుతో భారీ అవకతవకలకు పాల్పడుతున్నారు" అని కేటీఆర్ విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో కార్మికులకు దక్కిన హక్కులను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.

పింఛన్లు, హామీలపై సెటైర్లు

ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు."కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ఎవరికైనా రూ.4 వేల పింఛన్ లేదా తులం బంగారం వచ్చి ఉంటే వారంతా కాంగ్రెస్‌కు ఓటేయండి. కానీ, రూ.2 వేల పింఛన్, రైతుబంధు పొందుతున్న వారు మాత్రం కచ్చితంగా కారు గుర్తుకే ఓటేయాలి" అని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే ప్రజలు తమను తాము ముంచుకోవడమేనని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తేనే భయం వచ్చి హామీలను అమలు చేస్తారని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ గెలుపుతోనే రక్షణ

అభివృద్ధికి, వినాశనానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు. పరకాలలో జరిగిన సభలోనూ స్థానిక అభ్యర్థులను గెలిపించాలని, బీఆర్‌ఎస్ గెలుపుతోనే తెలంగాణ ప్రయోజనాలు కాపాడబడతాయని ఆయన స్పష్టం చేశారు.

Full View


Tags:    

Similar News