Telangana Panchayat Elections: ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ
Telangana Panchayat Polls: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పదవుల పందేరం షురూ అయింది.. ఎలాగైనా సర్పంచ్ సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
Telangana Panchayat Elections: ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్.. నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ఈసీ
Telangana Panchayat Polls: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో పదవుల పందేరం షురూ అయింది.. ఎలాగైనా సర్పంచ్ సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. పలువురు ఆశావహులు హామీల వర్షంతో పాటు నోట్ల వర్షం కురిపిస్తున్నారు. మొదటి విడత నామినేషన్ల పర్వం జోరందుకుంది. సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. బలవంతపు ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది.
ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, బలవంతపు ఉపసంహరణలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఏకగ్రీవాలకు సంబంధించిన విధి విధానాలపై ఈసీ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలకు సూచనలు చేస్తూ ఎస్ఈసీ కార్యదర్శి ఉత్తర్వలుు జారీ చేశారు. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవం చెల్లదని స్పష్టం చేసింది.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని 15వ నిబంధన ప్రకారం ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఒక్కరే పోటీలో ఉండటం, అవతలి వ్యక్తిని భయపెట్టడం లేదా మోసానికి పాల్పడటం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా..? లేదా..? అన్నదానిపై ఫోకస్ పెట్టాలన్నారు. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలన్నారు. 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపారు. ఫిర్యాదులు లిఖితపూర్వకంగా, వాట్సాప్ ద్వారా, మౌఖికంగా లేదంటే వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల రూపంలో కూడా ఉండొచ్చని పేర్కొన్నారు.
సర్పంచ్, వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకేఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం డబ్బు ఎర చూపలేదని, వేలంపాటలో పాల్గొనడం, బెదిరింపులకు పాల్పడడం వంటివి చేయలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపారు.
అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకు వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలి. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించి, వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలి. అదే సమయంలో ఈ ఫలితం సమాచారంతో ఓ నివేదికను రూపొందించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొన్నారు. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే.. ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.