Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు
Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చిత్ర విచిత్రాలు బయటకొస్తున్నాయి.
Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు
Telangana Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో చిత్ర విచిత్రాలు బయటకొస్తున్నాయి. రిజర్వేషన్ల కేటాయింపుపై గ్రామాల్లో నైరాశ్యం నెలకొంది. అసలు ఎస్టీలే లేని గ్రామాలకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల కేటాయింపులో లోపాలు, అధికార యంత్రాంగం నిర్లక్ష‌్యమే అంటున్నారు.
నల్లగొండ జిల్లా పేరూరు గ్రామ పంచాయతీని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. ఎన్నికల రిజర్వేషన్లు ఎప్పుడూ ఆయా ప్రాంతాల్లోని జనాభా ప్రాతిపదికన, సామాజిక న్యాయం ప్రకారం ఖరారు చేస్తారు. కానీ, పేరూరు గ్రామంలో అధికారిక లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా సంఖ్య సున్నా. జనాభా లేని వర్గానికి ఆ గ్రామ సర్పంచ్ పదవిని రిజర్వ్ చేయడం.. స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అంతేకాదు, కేవలం సర్పంచ్ పదవే కాక, గ్రామంలోని మొత్తం నాలుగు వార్డులు కూడా ఎస్టీ వర్గానికే రిజర్వ్ కావడం గందరగోళాన్ని మరింత పెంచింది.
ఈ రిజర్వేషన్ల కేటాయింపు తమ హక్కులను కాలరాయడమేనని గ్రామస్తులు భావించారు. తమ గ్రామంలో అత్యధికంగా ఉన్న బీసీ, ఓసీ వర్గాలకు అవకాశం లేకుండా పోవడం, లేని వర్గానికి పదవిని కేటాయించడంపై వారంతా ఏకమయ్యారు. ఈ అసంబద్ధ నిర్ణయాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆ నిర్ణయం కచ్చితంగా అమలయ్యేలా చూశారు. నామినేషన్ల దాఖలుకు ఎన్నికల సంఘం ప్రకటించిన చివరి తేదీ వరకు కూడా, పేరూరు గ్రామం నుంచి సర్పంచ్ పదవికి గానీ, వార్డు సభ్యుల పదవులకు గానీ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఇది గ్రామ ప్రజల సంఘీభావానికి, వారి నిర్ణయానికి తిరుగులేని సాక్ష్యం. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు అధికారికంగా పాల్గొనకుండా నిరసన తెలియజేయడం రాష్ట్రంలోనే అరుదైన రాజకీయ పరిణామం..
ఈ ఘటన రిజర్వేషన్ల కేటాయింపులో ఉన్న లోపాలను, స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తోంది. జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసే ప్రక్రియలో ఈ పొరపాటు ఎలా జరిగింది. కింది స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరూ ఈ లోపాన్ని గుర్తించకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయి?.ప్రస్తుతం, పేరూరు ఎన్నికలు ఆగిపోయాయి. నామినేషన్లు లేకపోవడంతో... నల్లగొండ జిల్లా రిటర్నింగ్ అధికారి తీసుకోవాల్సిన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికల సంఘం ఈ రిజర్వేషన్‌ను రద్దు చేసి, జనాభా ప్రాతిపదికన కొత్త రిజర్వేషన్‌ను తక్షణమే కేటాయిస్తుందా? లేక, ప్రక్రియను రద్దు చేసి మళ్లీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాల్సి వస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.మొత్తంగా, పేరూరు గ్రామం ఒక చిన్న రాజకీయ పాఠాన్ని నేర్పింది. అధికారిక నిబంధనలు, సాంకేతిక ప్రక్రియలు ప్రజల వాస్తవ అవసరాలు, సామాజిక న్యాయానికి దూరమైతే... ప్రజలు తమ ప్రజాస్వామ్య హక్కు అయిన బహిష్కరణ ద్వారా గట్టి సమాధానం చెప్పగలరని నిరూపితమైంది.