గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు.. ఎక్కడ పూజలందుకుంటాడో అక్కడే..

Update: 2020-08-20 05:28 GMT

Ganesh Chaturthi celebrations: వినాయక చవితి వచ్చిందంటే చాలు జంట నగరాల్లో ఆ సందడే వేరు టాంక్‌బండ్ దగ్గర గణపతుల నిమజ్జనాలను వీక్షీంచేందుకు జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ కళ లేదు ఆ సంబరం లేదు. కరోనాతో గణేశ్ ఉత్సవాలు ఇంటికే పరిమితం కానున్నాయి. బొజ్జ గణపయ్యలు ఇళ్లలోనే ఉండిపోనున్నారు. గణేశుడు ఎక్కడ పూజలందుకుంటాడో అక్కడే నిమజ్జనం చేయాలని అధికారులు అంటున్నారు. జంట నగరాల్లో గణేశ్ ఏర్పాట్ల గురించి హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.

కరోనా వల్ల ఈ సారి గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఖైరతబాద్, బాలాపూర్ వినాయకుల దగ్గర కోవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పోయిన సంవత్సరం 65 అడుగుల ఎత్తున దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడు ఈసారి కేవలం 9 అడుగులు మాత్రమే దర్శనం ఇవ్వనున్నాడు. ప్రతి సంవత్సరం ఖైరతబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఈసారి కరోనా వల్ల ఆన్‌లైన్‌లో మాత్రమే దర్శనం చేసుకోవాలని నిర్వాహకులు చెప్తున్నారు.

గణేశ్ నిమజ్జనాల విషయంలో హిందువుల సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రేటరీ భగవంతరావు విమర్శించారు. గత సంవత్సరం లక్షా 11 వేల మండపాలు ఏర్పాటు చేశారని ఈసారి విగ్రహాల ఎత్తుకు పోటీపడకుండా సాదాసీదాగా జరుపుకోవాలని ఆయన సూచించారు. ఈసారి ప్రభుత్వ ఆంక్షలతో ట్యాంక్ బండ్ దగ్గర ప్రతి సంవత్సరం కనిపించే వాతావరణం కనిపించదు. కేవలం ఖైరతాబాద్‌తో పాటు బాలాపూర్ వినాయకులకు మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

Tags:    

Similar News