ప్రైవేట్ కాలేజీలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు సఫలం
తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులతో రెండు రోజులుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. నిన్న జరిపిన చర్చలు సఫలం కావడంతో తరగతుల బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రకటించాయి. నేటి నుంచి తరగతులు యథాతథంగా కొనసాగనున్నాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఛిన్నాభిన్నం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. పదేళ్ల పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మార్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్ తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశంమని.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ రేషనలైజేషన్ కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించినట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలన్న డిమాండ్‌తోనే కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తెలిపాయి. వారంలో 600 కోట్లు.. దీపావళికి మరో 600 కోట్లు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం హామీ ఇచ్చిందని యాజమాన్యాలు వెల్లడించాయి. నేటి నుంచి యధావిధిగా ప్రభుత్వానికి తమ సహాయసహకారాలు అందుతాయని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు.