Online Classes for Telangana Students: ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

Update: 2020-07-20 05:16 GMT

Online Classes for Telangana Students: కరోనా మహమ్మారి తో విద్యా సంవత్సరం మొదలు కాలేదు. ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ విద్యాలయాలు విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం కూడాఆన్ లైన్ క్లాసులకు యోచిస్తోంది. ముందుగా జూనియర్ కాలేజీల లెక్చరర్లకు ట్రైనింగ్ ఇవ్వనుంది. దేశంలో ఏటా విద్యా సంవత్సరం సాధారణంగా జూన్ రెండో వారంలో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తుంది. కరోనా ప్రభావంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జూలై చివరి వారంలో లేదా ఆగస్టులో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో పోలిస్తే దాదాపు రెండు నెలలు ఆలస్యంగా క్లాసులు మొదలుకానున్నాయి.

స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరచుకుంటే విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆన్‌లైన్ తరగతులకు మొగ్గు చూపితే అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయా అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రస్తుతం చాలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాలయాలు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నాయి. హోంవర్క్ ను వాట్సాప్‌లో అందిస్తున్నాయి. ఐఐటీలు, యూనివర్సిటీల్లో వెబినార్ ద్వారా పాఠ్యాంశాలను వీడియో రూపంలో రికార్డు చేసి పంపిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలల్లో కూడా డిజిటల్ భోదన అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది.

ప్రభుత్వ కాలేజీలలో భోదించే అధ్యాపకులకులను డిజిటల్ దిశగా తీసుకు వెళ్లోంది విద్యాశాఖ. మొదటి దశలో జూనియర్ కళాశాలల లెక్చరర్లకు ఆన్‌లైన్ క్లాసుల గురించి శిక్షణ ఇస్తారు. పదిహేను రోజులపాటు డిజిటల్ దిశ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తారు. మొదటి దశలో 5,300 మంది లెక్చరర్లను పన్నెండు బ్యాచ్‌లుగా విభ‌జించి ట్రైనింగ్ ఇస్తారు. డిజిటల్ సాధనాలను ఎలా ఉపయోగించాలో వివరించనున్నారు. రాను రాను ప్రొఫెసర్లకు కూడా ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగాఅధ్యాపకులకు ఆన్ లైన్ తరగతులపై శిక్షణ ఇస్తుంది.

Tags:    

Similar News