ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీలో చర్చకొచ్చిన అంశాలు ఏంటంటే...

Update: 2025-02-26 06:55 GMT

ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి భేటీలో చర్చకొచ్చిన అంశాలు

Revanth Reddy meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంటకుపైగా వీరిద్దరి మధ్య ఈ భేటీ జరిగింది. ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి నాయుడు, డీజీపీ జితేందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ భేటీలో పాల్గొన్నారు.


ఇక ఈ సమావేశంలో చర్చకొచ్చిన అంశాల విషయానికొస్తే... ఎస్ఎల్ బీసీ సొరంగం వద్ద జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ గురించి సీఎం రేవంత్ ప్రధాని మోదీకి వివరించారని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ మెట్రో విస్తరణ పనులు, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ స్టేటస్, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు కేంద్రం తరపున ఆర్థిక సహాయం అందించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కోరారు.

కులగణన సర్వే గురించి ... 

సంచలనం సృష్టించిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి వివరించారు. రాష్ట్ర విభజన హామీలు, కేంద్రం నుండి తెలంగాణకు ఇంకా రావాల్సి ఉన్న పెండింగ్ నిధుల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించారని తెలుస్తోంది. వివిధ రంగాల్లో తెలంగాణకు కేంద్రం నుండి రావాల్సిన సంస్థలు, కేంద్రం నిధులను సీఎం రేవంత్ చర్చించినట్లు సమాచారం అందుతోంది. 

Full View

కేంద్రమంత్రులతో భేటీకి యత్నం

ఇదే ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా నీటి పంపకాల విషయంలోనూ పలు విభేదాలు నడుస్తున్నాయి. అందుకే ఈ సమస్య పరిష్కారంతో పాటు పలు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం సాయం కోరడం కోసం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆయా కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని సమాచారం అందుతోంది. 

ALSO WATCH THIS VIDEO: New York Grand Central Railway Station: 48 ఎకరాల మాయా ప్రపంచం

 Full View 

Tags:    

Similar News