Telangana CM KCR Review on Rythu Bandhu: రైతులందరికీ రైతుబంధు ఉండాలి.. సీఎం కేసీఆర్

Telangana CM KCR Review on Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు సాయం అందాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్

Update: 2020-07-11 16:20 GMT
CM KCR REVIEW ON AGRICULTURE

Telangana CM KCR Review on Rythu Bandhu: తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు సాయం అందాలని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఉన్న సరే వారిని గుర్తించి వారికి ఆర్ధిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.. రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇక ప్రభుత్వం సూచించిన నియంత్రిత పద్ధతిలో ఈ వానాకాలం పంట సాగు చేస్తుండడం శుభసూచకమని అన్నారు. రైతులు పండించిన పంటకు మంచి ధర రావడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు కేసీఆర్..

కరోనా లాంటి కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే రైతుబంధు సాయం విడుదల చేసిందని, అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారని అన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందిందని, ఇంకా ఎవరైనా రైతులు మిగిలిపోయి ఉంటే వెంటనే వారిని గుర్తించి సాయం అందించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

అంతేకాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా లేదా అని ఇంకా ఎవరైనా మిగిలిపోయారా అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలని అన్నారు. రైతులందరికీ రైతుబంధు సాయం అందించడానికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడబోదని కేసీఅర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనవద్దని, వందకు వంద శాతం రైతులందరికీ సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Tags:    

Similar News