TS Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ రాకపై సర్వత్రా ఆసక్తి..!!
TS Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కేసీఆర్ రాకపై సర్వత్రా ఆసక్తి..!!
TS Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. ప్రజల్లో కూడా భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి అసెంబ్లీకి హాజరవుతానని సంకేతాలు ఇవ్వడం చర్చకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సాగునీటి అంశంపై ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ప్రకటించిన కేసీఆర్ సభలో పాల్గొంటే.. చర్చలు తీవ్రస్థాయికి చేరే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రుణభారం, రైతు సమస్యలు వంటి అంశాలు హాట్ టాపిక్‌గా మారనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన నిర్ణయాలపై బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో, అసెంబ్లీ వేదికగా జల జగడం తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా సభలో మాట్లాడితే.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది.
ఇవాళ అసెంబ్లీ సమావేశాల తొలి రోజున డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లు, మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, అలాగే జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులు ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి.
పరిపాలనా సంస్కరణలు, స్థానిక సంస్థలకు అధికారాల వికేంద్రీకరణ, నగర పాలన బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువస్తుండగా, ప్రతిపక్షం వీటిపై గట్టి ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమవుతోంది. మొత్తంగా, కేసీఆర్ రాక, సాగునీటి అంశం, కీలక బిల్లులతో ఈ శీతాకాల సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.