Summer Holidays 2026 : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే
స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే
Summer Holidays 2026 : తెలంగాణలో ఎండలు మెల్లగా సెగలు పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు వణికించిన చలి మాయమై.. భానుడు తన ప్రతాపాన్ని మొదలుపెట్టాడు. ఉదయం వేళల్లోనే ఎండ చురుకు పుట్టిస్తుండటంతో, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మార్చి 16 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పాఠశాలల పని వేళల్లో మార్పులు రానున్నాయి. మార్చి 16 నుంచి స్కూళ్లు ఉదయం 8:00 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మాత్రం కాస్త భిన్నమైన టైమింగ్స్ ఉంటాయి. అక్కడ మధ్యాహ్నం 1:00 గంట నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు క్లాసులు లేదా పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. ఎండ తీవ్రత పెరగకముందే పిల్లలు ఇళ్లకు చేరుకునేలా ఈ ప్రణాళిక సిద్ధం చేశారు.
వేసవి సెలవుల షెడ్యూల్ ఖరారు
ఒంటి పూట బడుల ప్రకటనతో పాటే వేసవి సెలవులపై కూడా విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి గానూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉండనున్నాయి. సుమారు 48 రోజుల పాటు విద్యార్థులు సమ్మర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయవచ్చు. మళ్లీ జూన్ 12 (2026) నుంచి కొత్త విద్యా సంవత్సరం (2026-27) ప్రారంభమవుతుంది. సెలవుల షెడ్యూల్ ముందే రావడంతో చాలామంది తల్లిదండ్రులు ఊళ్లకు వెళ్లడానికి ఇప్పుడే ట్రైన్, బస్సు టికెట్లు బుక్ చేసుకునే పనిలో పడ్డారు.
రంజాన్ వేళ ఉర్దూ పాఠశాలలకు ఊరట
మరోవైపు, పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఉర్దూ మీడియం పాఠశాలలు మరియు ముస్లిం విద్యార్థులు అధికంగా ఉండే స్కూళ్లలో పని వేళలను ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు కేటాయించింది. ఉపవాస దీక్షల్లో ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ పూర్తి చేసేందుకు అవసరమైతే వారంలో ఒక రోజు అదనపు తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించింది.