Telangana SSC Exams 2026: 10/10 జీపీఏ లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు.. కొత్త కార్యాచరణ ఇదే!
Telangana SSC Exams 2026: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యాశాఖ అప్రమత్తమైంది.
Telangana SSC Exams 2026: 10/10 జీపీఏ లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు.. కొత్త కార్యాచరణ ఇదే!
Telangana SSC Exams 2026: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ (SSC) బోర్డు పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా సరికొత్త 'సపోర్టివ్ ప్లాన్'ను అమలు చేయాలని నిర్ణయించింది.
విద్యార్థుల వర్గీకరణ - ప్రత్యేక బోధన:
ప్రీ-ఫైనల్ పరీక్షల మార్కుల ఆధారంగా విద్యార్థులను వారి అభ్యసన సామర్థ్యాన్ని బట్టి మూడు కేటగిరీలుగా విభజించనున్నారు.
స్ట్రగ్లర్స్ (కేటగిరీ-1): పాస్ మార్కులు సాధించడానికి ఇబ్బంది పడే విద్యార్థులు. వీరు కనీసం ఉత్తీర్ణత సాధించేలా సులభతర బోధన అందిస్తారు.
యావరేజ్ (కేటగిరీ-2): సగటు మార్కులు వచ్చే విద్యార్థులు. వీరి స్కోరును మెరుగుపరచడంపై దృష్టి పెడతారు.
అడ్వాన్స్‌డ్ (కేటగిరీ-3): ప్రతిభావంతులైన విద్యార్థులు. వీరు 10/10 జీపీఏ (GPA) సాధించేలా ప్రోత్సహిస్తారు.
సెలవుల్లోనూ బడికి..:
ఈ ఏడాది పరీక్షల మధ్య 3 నుంచి 4 రోజుల వ్యవధి ఉండటంతో, ఆ సమయాన్ని వృథా చేయకుండా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. సబ్జెక్టుల్లోని కీలక అంశాలను వివరించడంతో పాటు, పరీక్షల్లో జవాబులు ప్రెజెంట్ చేసే విధానంపై ఉపాధ్యాయులు శిక్షణ ఇవ్వనున్నారు.
అయితే విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పరీక్షల సమయంలో మళ్లీ పాఠశాలలకు పిలవడం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెంచుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు ఇంటి వద్ద ప్రశాంతంగా చదువుకునే (Self-study) సమయాన్ని ఈ క్లాసులు దెబ్బతీస్తాయని, దీనివల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని వాదిస్తున్నారు.
విద్యాశాఖ లక్ష్యం మంచిదే అయినప్పటికీ, అమలు చేసే విధానం విద్యార్థులకు భారంగా మారకూడదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.