Jobs : PNBలో కొలువుల జాతర..5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

PNBలో కొలువుల జాతర..5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Update: 2026-02-07 01:21 GMT

Jobs : నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే గ్రాడ్యుయేట్లకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా తన శాఖల్లో ఖాళీగా ఉన్న 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ శిక్షణ కాలంలో బ్యాంకింగ్ మెళకువలు నేర్చుకోవడమే కాకుండా, ప్రతినెలా గౌరవప్రదమైన స్టైపెండ్ కూడా పొందవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ శాఖల్లో అప్రెంటిస్ షిప్ చట్టం-1961 కింద మొత్తం 5,138 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏ విభాగంలోనైనా గ్రాడ్యుయేషన్ (డిగ్రీ) పూర్తి చేసి ఉండాలి. అయితే, అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషలో (ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల వారు తెలుగులో) చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండటం తప్పనిసరి.

వయోపరిమితి, సడలింపులు

దరఖాస్తుదారుల వయస్సు జనవరి 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థులు 02.01.1998, 01.01.2006 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు వివరాలు

* ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ఫీజు కేటగిరీల వారీగా ఇలా ఉంది (GSTతో కలిపి):

* జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (పురుషులు): రూ.944

* జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ (మహిళలు): రూ.708

* ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), ట్రాన్స్‌జెండర్లు: రూ.236

ఎంపిక ప్రక్రియ, స్టైపెండ్

అభ్యర్థుల ఎంపిక మొత్తం నాలుగు దశల్లో జరుగుతుంది:

* ఆన్‌లైన్ రాత పరీక్ష: మార్చి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.

* స్థానిక భాషా పరీక్ష (LPT): ఎంచుకున్న రాష్ట్ర భాషలో ప్రావీణ్యం ఉండాలి.

* డాక్యుమెంట్ వెరిఫికేషన్: విద్యార్హత పత్రాల పరిశీలన.

* మెడికల్ ఎగ్జామినేషన్: అభ్యర్థి శారీరక దృఢత్వం.

ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఈ సమయంలో వారు పనిచేసే శాఖను బట్టి (రూరల్, సెమీ అర్బన్, అర్బన్) నెలకు రూ.12,300, మెట్రో నగరాల్లో అయితే రూ.15,000 వరకు స్టైపెండ్ లభిస్తుంది.

ముఖ్యమైన తేదీలు

* దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 8, 2026

* దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 24, 2026

* పరీక్ష నిర్వహణ (తాత్కాలికంగా): మార్చి మొదటి వారం, 2026

Tags:    

Similar News