Cold Wave Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే 10 రోజులు తీవ్ర చలి
Cold Wave Alert: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Cold Wave Alert: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. వచ్చే 10 రోజులు తీవ్ర చలి
Cold Wave Alert: తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. వర్షాకాలం పూర్తై శీతాకాలం స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే చల్లని గాలులు తెలుగురాష్ట్రాలను తాకుతున్నాయి. దీంతో చలితీవ్రత క్రమక్రమంగా పెరుగుతూపోతుంది. రాబోయే రోజుల్లో ఇది తారాస్థాయికి చేరుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు వాతావరణ పరిస్థితులను బట్టి చూస్తే ఈ నవంబర్‌లో గత ఏడేళ‌్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని.. ముఖ్యంగా తెలంగాణపై చలిపంజా విసురుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
ఇటీవల మొంథా తుపాను ఎఫెక్ట్‌తో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. కానీ ప్రస్తుతం ఇరురాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం ఉంది. కొన్నిసార్లు భారీ వర్షాలు కురిసిన తర్వాత వాతావరణం పూర్తి పొడిగా మారిపోతుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలుంటాయట. ఈ క్రమంలోనే రాబోయే 10-15 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందనేది తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో చలితీవ్రత గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా నవంబర్ 17 వరకు ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారి ఏపీ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈనెల 17 తేదీ వరకు చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వెదర్‌మ్యాన్ చెప్పారు. ఈ సమయంలో కొన్ని జిల్లాల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు అంటే 10 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువకు పడిపోతాయన్నారు. రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీ సెంటిగ్రేడ్ లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో భాగ్యనగరవాసులు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటోంది. నగరంలో చాలాప్రాంతాల్లో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఇది సాధారణం కంటే తక్కువని వారు అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కూడా మంచు ప్రభావం కనిపిస్తోంది. నగర కేంద్రంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పటాన్‌చెరు, దుండిగల్, హయత్‌నగర్, హకీంపేట, రాజేంద్రనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
ఏపీలో కూడా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగ మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు అవస్థలు పడుతున్నారు. అల్లూరి, చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, విజయనగరం, కడప, ప్రకాశం, అనకాపల్లి, నంద్యాల, మన్యం, పల్నాడు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.