Student Unemployment Jung: మరో ఉద్యమానికి సిద్ధమైన టీ.కాంగ్రెస్

Student Unemployment Jung: *విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ఆందోళనకు సిద్ధం *నేటి నుంచి విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్

Update: 2021-10-02 02:23 GMT

మరో ఉద్యమానికి సిద్ధమైన టీ.కాంగ్రెస్

Student Unemployment Jung: మరో ఉద్యమానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాటానికి నేడు శ్రీకారం చుడుతోంది. దళిత, గిరిజన దండోరా స్పూర్తితో రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 'విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్' కార్యక్రమం చేపడుతోంది. మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం 65 రోజుల పాటు సాగనుంది. తెలంగాణ మలి దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి అమరుడైన చోటు నుంచే సైరన్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తదితర నేతలు పాల్గొంటారు.

రాష్ట్రంలోని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనార్టీ, ఆదివాసీ విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని, 4వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు 3వేల 16 రూపాయలను నిరుద్యగ భృతి చెల్లించాలని, వెంటనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు జారీ చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కార్యక్రమంలో భాగంగా మండల, ఉమ్మడి జిల్లాల స్థాయిలో యూత్ కాంగ్రెస్, NSUI నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టనున్నాయి.

అదేవిధంగా ఉమ్మడి జిల్లాల వారీగా యూనివర్సిటీల్లో కార్యక్రమాలు, సభలను ఏర్పాటు చేయనుంది టీ.కాంగ్రెస్. పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, శాతవాహన తదితర విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి సదస్సులు నిర్వహిస్తారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిరుద్యోగ సైరన్ ముగింపు సభ నిర్వహించనుండగా.. రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముగింపు కార్యక్రమానికి లక్షలాది మంది నిరుద్యోగులతో భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News