తెలంగాణలో తహసీల్దార్ విజయా రెడ్డి హత్యపై రెవెన్యూ, ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. హత్య వార్త తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించిన రెవెన్యూ ఉద్యోగులు ఎక్కడికక్కడ ఆందోళనలు వ్యక్తం చేశారు. మానవ హారాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. పలుచోట్ల రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలిపారు.
విజయా రెడ్డి సజీవ దహనాన్ని నిరసిస్తూ ఇవాళ్టి నుండి మూడు రోజులపాటు విధులు బహిష్కరించనున్నట్లు ప్రకటించారు రెవెన్యూ ఉద్యోగులు. మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ను ప్రకటించారు. ఇక, విజయారెడ్డి సజీవ దహనాన్ని ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. ప్రజలకు రక్షణ కల్పించే ఓ ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్‌పై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టమని, నిందితున్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకి భద్రతపై హామీ ఇచ్చే వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు ప్రకటించారు.
అయితే ఇవాళ ఉదయం 11 గంటలకు తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. నాగోల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై పలువురు స్పందించారు. నిందితునిపై ప్రభుత్వం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది అత్యంత బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. విజయారెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.