కరోనా సాకుతో కార్మికులపై వేటు

Update: 2020-08-11 06:46 GMT

Special Story on Mancherial Cement Company Workers:బతుకులకు బరోసానిచ్చిన పరిశ్రమ ఇప్పుడు కాదు పొమ్మంటోంది. చీకటి జీవితాలలో వెలుగులు నింపిన పరిశ్రమ ఇప్పుడు రావొద్దంటోంది. కరోనా పేరుతో కార్మికులను విచక్షణంగా తొలగిస్తోంది. దీంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మంచిర్యాల సిమెంట్ పరిశ్రమలో ఊడుతున్నా ఉద్యోగాల పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.

ఉపాధి కల్పన పెంపొందించే ఆలోచనతో 1954-55లో అప్పటి ప్రభుత్వం నామమాత్ర రుసుముతో 250 ఎకరాల భూమిని ఏసీసీ కంపెనీకి అప్పగించింది. తర్వాత ఈ కంపెనీ మరో 300 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా కొనుగోలు చేసింది. 2004 వరకు పరిశ్రమను నడిపిన ఏసీసీ కంపెనీ 2005 లో 50 కోట్లకు ఎంసీసీ కంపెనీకి విక్రయించింది. ఏసీసీ కంపెనీలో దాదాపు 1200 మంది కార్మికులు పనిచేసి రోజుకు వెయ్యి టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేసేవారు.

అయితే ఎంసీసీ కంపెనీ 40 ఎకరాలను హైటెక్ సిటీ కాలనీ కి 60 కోట్ల రూపాయలకు విక్రయించి లాభాలు ఆర్జించింది. మిగిలిన 500 ఎకరాలు కంపెనీ ఆధీనంలో ఉంది. వీటి విలువ సుమారు 1500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ భూమి కూడా విక్రయించి రియల్ వ్యాపారం చేయాలని కంపెనీ దురుద్దేశం. దీంతో కరోనాను సాకుగా చూపి 238 మంది కార్మికులను వేధింపులకు గురిచేస్తూ 120 మంది కార్మికులను బయటకు పంపించింది కంపెనీ యాజమాన్యం.

ఇక మిగిలిన కార్మికులు 95 మంది. కంపెనీ వీరితో ఉత్పత్తి ప్రారంభించకుండా 14 నెలల పాటు పనులను నిలిపివేసింది. వారం రోజుల క్రితం మరో 20 మంది ఉద్యోగులను అమానుషంగా తొలగించింది. మరో 35 మందిని తొలగించడానికి ప్రయత్నిస్తోందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ను సాకుగా చూపి కంపెనీ యాజమాన్యం కంపెనీ మూసివేయాలని ప్రయత్నిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

సర్కారు సబ్సీడీలు పొంది పరిశ్రమను మూసివేయడానికి ప్రయత్నిస్తుండడంతో కార్మికులు మండిపడుతున్నారు. యాజమాన్యం కుట్రలు కార్మికుల ఉపాధిని దూరం చేసేవిధంగా ఉన్నాయి. వెంటనే స్ధానిక ఎమ్మెల్యే దివాకర్ రావు, మంత్రి కేటీఆర్ స్పందించి తమకు సరైన న్యాయం చేయాలని కార్మికులు కోరుతున్నారు.

Full View



Tags:    

Similar News