సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌... 151 ఏళ్ల ఈ చరిత్ర ఇక కనిపించదు

Secunderabad Railway station history and significance: 151 ఏళ్ల చరిత్ర ఉన్న నవాబుల కాలం నాటి ఈ చారిత్రక కట్టడం పూర్తిగా నేలమట్టం కాబోతోంది. ఇప్పటికే మెయిన్ స్టేషన్ బిల్డింగ్ కూలగొట్టే పని మొదలైంది.

Update: 2025-02-20 13:19 GMT
Secunderabad Railway station main building demolition underway in order to modernize the railway station

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌... 151 ఏళ్ల ఈ చరిత్ర ఇక కనిపించదు

  • whatsapp icon

వెయిట్ వెయిట్ వెయిట్... మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూశారా? ఏంటి... ఇంకా చూడలేదా? అయితే వెంటనే వెళ్లి చూసేయండి. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేరు. ఇకపై మీరు చూడబోయే రైల్వే స్టేషన్ వేరు. 151 ఏళ్ల చరిత్ర ఉన్న నవాబుల కాలం నాటి ఈ చారిత్రక కట్టడం పూర్తిగా నేలమట్టం కాబోతోంది. ఇప్పటికే మెయిన్ స్టేషన్ బిల్డింగ్ కూలగొట్టే పని మొదలైంది.

అలాగని కూలగొట్టిన రైల్వే స్టేషన్‌ను అలాగే వదిలేస్తారనుకోకండి. ఇంకో రెండేండ్ల తరువాత మీరు అటువైపు వెళ్లి చూస్తే... అక్కడ ఇప్పుడున్న రైల్వే స్టేషన్ స్థానంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంటి కొత్త రైల్వే స్టేషన్ కనిపిస్తుంది. అప్పుడు మీకు ఈ పాత రైల్వే స్టేషన్ ఆనవాళ్లు భూతద్దం పెట్టి వెదికినా కనిపించవు. గతంలో నేను చూసిన రైల్వే స్టేషన్ ఏమైపోయిందనిపించేంతగా మార్పు వస్తుంది. అందుకే ఎంతో పెద్ద చరిత్ర ఉన్న ఈ పురాతన రైల్వే స్టేషన్‌ను ఓసారి అర్జెంటుగా చూసేయండి. కానీ అంతకంటే ముందుగా అసలు సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌ను ఎవరు ఏర్పాటు చేశారు? ఎందుకు ఏర్పాటు చేశారనేది ఇప్పుడు చూసొద్దాం రండి.

Full View

ఎంతోమంది జర్నీలో ఒక భాగమైన ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫస్ట్ జర్నీ 1870 లో మొదలైంది. అప్పటి 6వ నిజాం మీర్ మొహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఈ స్టేషన్ నిర్మించారు. 1874 అక్టోబర్ 8న ఈ రైల్వే స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించారు.

మొట్టమొదటిసారిగా మీర్ మొహబూబ్ అలీ ఖాన్‌తో పాటు సర్ సాలార్ జంగ్, శామ్స్ ఉల్ ఉమ్రా స్ట్రీమ్ ఇంజన్‌పై ఇక్కడి నుండి సమీపంలోనే ఉన్న తిరుమలగిరి మిలిటరీ సైడింగ్ వరకు ప్రయాణించారు. తొలుత ఈ రైల్వే స్టేషన్‌ను బ్రిటిషర్స్ వర్తకం, సైన్యం తరలింపు కోసం ఉపయోగించారు.

బ్రిటీష్ వాళ్లు బాంబే ప్రెసిడెన్సీని ఏర్పాటు చేసిన తరువాత బాంబేను, మద్రాస్‌ను కలిపే రైలు మార్గం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు. అప్పుడు వారికి మార్గం మధ్యలో హైదరాబాద్ గుండా వెళ్లడం అనేది కీలకంగా మారింది. అలా సికింద్రాబాద్ జంక్షన్ పుట్టుకొచ్చిందని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తరువాత కాలంలో ప్రభుత్వాన్ని ఒప్పించి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ సేవలను స్థానికులకు కూడా చేరువ చేయడంలో సాలార్ జంగ్ కీలక పాత్ర పోషించారనేది వారి చెబుతున్న మాట.

అందుకే దేశంలోనే అతి పాత రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటి. అంతేకాదు... అత్యంత రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలోనూ ఒకటిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పేరుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల వాసులకే కాదు... నగరానికి వచ్చిపోయే వారితోనూ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ఒక అనుబంధం పెనవేసుకుంది.

ఇప్పటివరకు మనం చూసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాలానుగుణంగా మార్పులు చెందుతూ వచ్చింది. మొదట్లో కట్టిన పింక్ -క్రీమ్ బిల్డింగ్ మాత్రం 1950 లో నేలమట్టం చేశారు.

నగరంలోనే ఓవైపు కాచిగూడ, మరోవైపు నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నప్పటికీ.. భౌగోళికంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషనే సిటీలోని ఎక్కువ ప్రాంతాలకు కనెక్ట్ చేస్తుంది. అందుకే నిత్యం సిటీకి వచ్చే వారిలో ఎక్కువమందికి సికింద్రాబాద్ రైల్వే స్టేషనే స్వాగతం పలుకుతుంది. వెళ్లే వారికి వీడ్కోలూ చెబుతుంది. అందుకే రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ కూల్చేస్తున్నారనే వార్త కూడా వారిని ఎంతో బాధిస్తోంది. ఇదే విషయమై వారు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

రూ. 700 కోట్ల ప్రాజెక్ట్ - లక్ష్యం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అచ్చం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తరహాలో పూర్తి ఆధునిక హంగులతో తీర్చిదిద్దబోతున్నారు. అందుకోసం రూ. 700 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ రైల్వే స్టేషన్‌ను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పనుల్లో వేగం పెంచారు.

సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ పక్కనే మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణం జరుగుతోంది. దక్షిణాన నిర్మించనున్న కట్టడాలకు సంబంధించిన పునాది పనులు కూడా నడుస్తున్నాయి. అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భవనం, నీళ్ల ట్యాంకుల నిర్మాణం కూడా జరుగుతోంది.

నగరం నడి మధ్యలో మరో కొత్త చరిత్ర

నిత్యం రైల్వే స్టేషన్‌కు వచ్చీపోయే రైల్వే ప్రయాణికులకు ఏ ఇబ్బందీ లేకుండా ఉండేందుకు దశలవారీగా బిల్డింగ్ నిర్మాణాల పనులు చేస్తున్నారు. ఇప్పటికే సిటీ శివార్లలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ రూపరేఖలు ఏ రేంజులో మారిపోయాయో అందరికీ తెలిసిందే. ఇది చర్లపల్లి రైల్వే స్టేషనా లేక ఎయిర్ పోర్టా అనేంతగా అన్ని ఆధునిక హంగులు వచ్చేశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వర్క్ కూడా పూర్తయితే... అప్పుడు సిటీ మధ్యలోనే మరో ఎయిర్ పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్‌ను కూడా చూడొచ్చు. అక్కడి నుండే నగరం నడి మధ్యలో మరో కొత్త చరిత్ర మొదలవుతుంది.

Tags:    

Similar News