భాగ్యనగరాన్ని వెంటాడుతోన్న సీజనల్ ఫీవర్స్

వర్షాలు, వరదల దెబ్బకు భాగ్యనగరం ఏ స్థాయిలతో కుదేలైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రోజుల తరబడి నగరంలోని చాలా కాలనీలు నీళ్లలోనే మునిగి ఉన్నాయి.

Update: 2020-10-27 12:00 GMT

వర్షాలు, వరదల దెబ్బకు భాగ్యనగరం ఏ స్థాయిలతో కుదేలైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రోజుల తరబడి నగరంలోని చాలా కాలనీలు నీళ్లలోనే మునిగి ఉన్నాయి. భారీ వరదలనుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగరవాసులను ప్రస్తుతం భయపెడుతున్న అంశం సీజనల్ వ్యాధులు. కరోనాకు సీజనల్ వ్యాధులు తోడవ్వడంతో ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి.

కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరం చిత్తడిగా మారింది. ముఖ్యంగా బస్తీలు పారిశుధ్యలేమికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. నాళాలు నిండిపోయాయి, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు మురికి కూపాలుగా మారాయి. దీంతో దోమలు విపరీతంగా పెరిగిపోయి జ్వరం, జలుబు, దగ్గుతో పాటు టైఫాయిడ్, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఫీవర్స్‎తో ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్స్ లో పేషంట్స్ సంఖ్య పెరుగుతోంది. మాములు రోజుల్లో 600 మంది వస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 1200 పెరిగింది. వైరల్ ఫివర్స్ వచ్చిన వాళ్ళు వెంటనే వైద్యం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ భయానికి సీజనల్ వ్యాధులు తోడవ్వడంతో తమకు వచ్చింది సాధారణ జ్వరమా లేక కొవిడ్ మహమ్మారా అన్నది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అయితే వైద్యులు మాత్రం ఎలాంటి అనుమానాలున్నా ఖచ్చితంగా కొవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఎన్నడూలేని విధంగా కష్టాలను, నష్టాలనూ చవిచూసింది. దీనికితోడు ప్రస్తుతం నగర ప్రజలను సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే కాదు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా రోజు రోజుకి సీజనల్ వ్యాధులతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. మన చుట్టూ ఉన్న పరిసరాల శుభ్రత ముఖ్యం కాబట్టి. ప్రతి ఒక్కరు పరిసరాల శుభ్రత తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు వైద్యులు.. అటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News