అదనపు బోగీలు కుదరదు.. స్పష్టతనిచ్చిన రైల్వే శాఖ

బీహార్‌ తదితర రాష్ర్టాలనుంచి మన రాష్ట్రానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను తరలించడం కోసం...

Update: 2020-06-24 05:00 GMT

బీహార్‌ తదితర రాష్ర్టాలనుంచి మన రాష్ట్రానికి వచ్చి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలసకూలీలను తరలించడం కోసం ఒక్క బోగీ అదనంగా వేయడానికి రైల్వేశాఖకు కనికరం కలుగడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. రైల్వేశాఖ వలస కార్మికుల పట్ల సంక్షోభ సమయంలో కూడా మానవత్వం చూపడం లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. సుమారు 95 మంది కార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు శిబిరంలో వేచివున్నారని, వారందరినీ ఒకేసారి తరలించడానికి అదనంగా ఒక బోగీ ఏర్పాటు చేయవచ్చు కదా అని ధర్మాసనం రైల్వేశాఖను ప్రశ్నించింది.

కాగా హైకోర్టు లో సోమవారం వాయిదా పడిన ఈ విచారణ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టింది. నిన్న జరిగిన విచారణకు దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం ఆనంద్ భాటియా హాజరయ్యారు. బుధవారం బీహార్‌కు చెందిన 45 మంది కూలీలను వారి స్వస్థలాలకు చేరుస్తున్నామని డీఆర్ఎం కోర్టుకు తెలియజేశారు. కాని వారికోసం ప్రత్యేకంగా అదనపు బోగీలు ఏర్పాటు చేయడం సాంకేతికంగా వీలుపడదని కోర్టుకు వెల్లడించారు. బుధవారం రోజున బీహార్ వెళ్లేవారందరికీ అత్యవసర కోటాలో టికెట్లు ఖరారు చేస్తామని తెలిపారు. కలెక్టర్ కోరితే రోజుకు 50 మంది వలస కూలీలకు ఈక్యూలో టికెట్లు కేటాయించేందుకు సిద్ధమని డీఆర్‌ఎం కోర్టుకు తెలియజేశారు. ఆయన వాదనను విన్నహైకోర్టు వలస కార్మికులు అందరూ వారి స్వస్థలాలకు చేరే వరకు ఇదే విధానం కొనసాగించాలని డీఆర్ఎం ఆనంద్ భాటియాకు సూచించింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 26కి వాయిదా వేసింది.


Tags:    

Similar News