Sammakka Saralamma Jatara 2020: వనదేవతల జాతరకు.. 304 ప్రత్యేక బస్సులు

Update: 2020-01-21 03:30 GMT

తెలంగాణ రాష్ట్రంలోని మేడారంలో వనదేవతలుగా కొలువై కొలిచిన వారి కోరికలు తీర్చే దేవతలను దర్శించుకునే తరుణం రానే వచ్చేసింది. వచ్చే ఫిబ్రవరిలో రానున్న సమ్మక్క సారక్క జాతర ప్రారంభానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఈ నేపథ్యంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని ఆర్టీసీ ప్రత్యుక బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ‌్యంలోనే సోమవారం సాయంత్రం ప్రయాణ ప్రాంగణంలో ఆరు డిపోల అధికారులతో ఆర్టీసీ రీజినల్‌ మేనేజర్‌ విజయభాస్కర్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలోని 6 డిపోల నుంచి 304 బస్సులను ప్రత్యేకంగా నడుపుతున్నామని తెలిపారు. ఆదిలాబాద్‌ డిపో నుంచి 55 కేటాయిస్తామని తెలిపారు. వీటిని చెన్నూర్‌ నుంచి మేడారం వరకు నడపుతామని తెలిపారు. ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి మొత్తం 65 బస్సులు కేటాయించగా అందులో ఆసిఫాబాద్‌ డిపో నుంచి 10, బెల్లంపల్లి డిపో నుంచి 55 బస్సులు నడిపిస్తామని తెలిపారు. అదే విధంగా భైంసా డిపో నుంచి 35 బస్సులను నడిపించనున్నారు. నిర్మల్‌ డిపో 52 బస్సులను మందమర్రి నుంచి, మంచిర్యాల డిపో నుంచి 97 బస్సులను నడుపుతున్నామని వెల్లడించారు.

ఇక పోతే గత జాతరకు 68వేల మంది భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకున్నారని, ఈ సారి 80 వేల మంది భక్తులను సరిపడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ వేసిన ప్రత్యేక బస్సుల్లో ప్రయాణిస్తే వారిని ఆలయం వరకు చేరుస్తాయని, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగించుకుని సమ్మక్క, సారలమ్మ కృపకు పాత్రులు కావాలన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీనే మంచిదని తెలిపారు. ఎక్కువ రద్దీలో కష్టపడకుండా ఆలయాన్ని చేరుకోవాలనుకునే వారు బస్సుల్లో ప్రయాణించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీవీఎం రమేశ్, డీఎం శంకర్‌రావు, పీవో విలాస్‌రెడ్డి, ఏవో బాలస్వామి, ఏఎం కల్పన, శ్రీకర్, రిజర్వేషన్‌ ఇన్‌చార్జి హుస్సేన్, ఆర్‌ఎం కార్యాలయ ఉద్యోగి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.




Tags:    

Similar News