Chevella Road Accident: టిప్పర్ వేగమే ప్రమాదానికి కారణమా..? టిప్పర్లపై పోలీసుల నిఘా కొరవడిందా.?
Chevella Road Accident: బస్సు ప్రమాదానికి టిప్పర్ వేగమే కారణమా...? కంకర ఓవర్ లోడ్‌తోనే టిప్పర్ అదుపు తప్పిందా...?
Chevella Road Accident: బస్సు ప్రమాదానికి టిప్పర్ వేగమే కారణమా...? కంకర ఓవర్ లోడ్‌తోనే టిప్పర్ అదుపు తప్పిందా...? కంకరపై టార్పిలిన్ కప్పకపోవడమే ప్రమాద తీవ్రతను పెంచిందా...? మీర్జాగూడ బస్సు ప్రమాదంపై నిర్లక్ష‌్యం ఎవరిది...?
వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తెలుగురాష్ట్రాల్లోని రోడ్లు రక్తమోడుతున్నాయి. ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సి వస్తోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి ఇంటికి క్షేమంగా చేరుకుంటాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మీర్జాగూడ ప్రమాదంలో టిప్పర్ బీభత్సం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. టిప్పర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్యంతో 19మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. టిప్పర్‌లో కంకరను అధిక లోడ్‌తో తీసుకెళ్తున్నారు. అధిక లోడ్‌తో టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ తప్పారు. ఎదురుగా వస్తున్న బస్సును వేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ఢీకొంది. అతి వేగంతో ఢీకొనడంతో టిప్పర్, బస్సు నుజ్జునుజ్జు అయ్యాయి. టిప్పర్‌లో ఉన్న కంకర బస్సులో పడింది. దీంతో బస్సులో ప్రయాణికులు టిప్పర్‌లో కూరుకుపోయారు. ఇటు బస్సులో కెపాసిటికి మించి ప్రయాణికులు ఉన్నారు. 70 మంది ప్రయాణికులు బస్సులో ఎక్కారు. అంతమంది బస్సు ఎక్కడం కూడా ప్రమాదంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణమైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి అధ్వాన్నంగా మారింది. నాలుగు వరుసల రోడ్డు ఇటీవలే శాంక్షన్ అయింది. 4 వరుసల రోడ్డు పూర్తి అయి ఉంటే ప్రమాద జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్ని ప్రమాదాలు జరిగినా... పోలీసులు అవగాహన కల్పించినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు. నిద్రమత్తు, అధిక లోడు, మద్యం తాగి వాహనం నడపడం పరిపాటిగా మారింది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో టిప్పర్ వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. టిప్పర్ల ద్వారా నిర్మాణ పనులకు కంకర, ఇసుక, ఇటుక, సిమెంట్, ఐరన్ తరలిస్తుంటారు. వాటిని తరలించే క్రమంలో కనీస జాగ్రత్తలు తీసుకోరు. ఇసుక, కంకర తరలిస్తూ వాటిపై కనీసం టర్పాలిన్లు కప్పరు. దీంతో రోడ్డుపైన ఇసుక, కంకర పడుతుంది. దీంతో పలు వాహనాలు స్లిప్ అయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. టిప్పర్లపై ట్రాఫిక్ పోలీసుల నిఘా కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి.