Gadwal: ఎమ్మెల్యే బండ్లను ఇరుకున పెట్టనున్న కేటీఆర్ సభ
Gadwal: బీఆర్‍ఎస్.. కోర్టులో వేసిన పార్టీ ఫిరాయింపుల కేసు ఆ నియోజకవర్గంలో కొత్త చిచ్చు రేపింది.
Gadwal: ఎమ్మెల్యే బండ్లను ఇరుకున పెట్టనున్న కేటీఆర్ సభ
Gadwal: బీఆర్‍ఎస్.. కోర్టులో వేసిన పార్టీ ఫిరాయింపుల కేసు ఆ నియోజకవర్గంలో కొత్త చిచ్చు రేపింది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీలో రగులుతున్నవర్గపోరుకు బీఆర్‍ఎస్ వేసిన కేసు మరింత ఆజ్యం పోసిందట. బీఆర్‍ఎస్ వేసిన పార్టీ ఫిరాయింపు కేసు కారణంగా అక్కడి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉండాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. అయితే ఆ ఎమ్మెల్యేపై వేసిన కోర్టు కేసుతో.. సంతోషంలోకి వెళ్ళిన ఆయన ప్రత్యర్థికి.. ఆ సంతోషం కొన్ని రోజులైనా నిలువకుండా పోయిందట. ఇందుకు కారణం పార్టీలోని నేతలకు ఆ మహిళా నేత పొమ్మనలేక పొగ పెట్టడమేనని తెలుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గంలో అధికార పార్టి ఖాళీ అయ్యే పరిస్థితులు తలెత్తాయన్న టాక్ కొనసాగుతోంది. బీఆర్‍ఎస్ వేసిన కేసుతో ఇరుకున పడ్డ ఆ ఎమ్మెల్యే ఎవరు..? వర్గపోరుతో పార్టీని ఇబ్బందుల్లో నెట్టుతున్న ఆ మహిళా నేత ఎవరు..? ఇంతకీ ఏదా నియోజకవర్గం..?
గద్వాల నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకు కార్యకర్తలు సైతం లేకుండా చతికిలాపడిన బీఆర్‍ఎస్ పార్టీ.. ఒక్కసారిగా పుంజుకుందన్న టాక్ జోరందుకుంది. ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై కోర్టులో పార్టీ పిరాయింపుల కేసు వేశారు గులాబీ నేతలు. బీఆర్‍ఎస్ వేసిన ఈ పార్టీ ఫిరాయింపుల కేసు మిగతా 9 నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా గద్వాల నియోజకవర్గంలో మాత్రం చాలా మార్పులకే కారణమయ్యిందన్న టాక్ వినిపిస్తుంది. కోర్టు పార్టీ ఫిరాయించిన ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పీకర్‍కు ఆదేశాలివ్వడం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఆయా ఎమ్మెల్యేలకు నోటిసులు అందించడం, ఆ నోటిసులు అందుకున్న ఎమ్మెల్యేలు స్పీకర్‍కు తాము పార్టీ మారలేదని వివరణ ఇచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి. ఇలా వివరణ ఇచ్చిన ఎమ్మెల్యేల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉండటంతో... గద్వాల నియోజకవర్గంలొ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.
ప్రధానంగా 2023 ఎన్నికల్లో గద్వాలలో బీఆర్‍ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.. నియోజకవర్గ అభివృద్ది కోసమని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో జరిగిన కార్యక్రమాల్లోనూ, అలాగే మంత్రులు, ఎంపీలతో కలిసి నిర్వహించిన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో బండ్ల.. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇష్టంలేని మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆయన రాకను వ్యతిరేకించారు. అయినప్పటికీ మంత్రి జూపల్లి చొరవతో ఎమ్మెల్యే బండ్ల.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టిలో చేరారు. దీంతో నాటినుంచి గద్వాల నియోజకవర్గంలోని అధికార కాంగ్రెస్ పార్టీలో సరిత వర్సెస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నట్టు పరిస్థితులు కొనసాగుతూ వస్తున్నాయి. ఏ అధికారిక కార్యక్రమం అయినా సరే ఈ ఇరు వర్గాల మధ్య తోపులాటలు, వ్యక్తిగత దూషణలతో గద్వాల నియోజకవర్గం అట్టుడికి పోతూ వస్తోంది. వీరిద్దరి వర్గపోరు కారణంగా మంత్రులు సైతం గద్వాలలో అడుగుపెట్టాలంటేనే హడలిపోయే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో పార్టీ పిరాయింపుల కేసు, సరిత వర్గానికి ఎంతో సంతోషాన్నిచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. స్పీకర్ నుంచి నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే బండ్ల.. స్పీకర్‍కు తాను బీఆర్‍ఎస్ పార్టిలోనే ఉన్నానని వివరణ ఇచ్చుకున్నారు. అంతే కాదు మీడియాతోనూ తాను బీఆర్‍ఎస్‍లోనే ఉన్నాననీ, నియోజకవర్గం అభివృద్ది కోసమే సిఎంను కలిశాననీ చెప్పుకున్నారు. కేవలం మర్యాద పూర్వకంగానే సీఎం తనకు కండువా కప్పారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల ప్రకటించారు. దీంతో సరిత వర్గంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించిందన్న ప్రచారం గద్వాలలో జోరందుకుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదన్న ప్రచారం కూడా జోరుగానే సాగుతోంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సరిత వర్గం ఒంటెత్తు పోకడలు పోతున్నారన్న కారణంగా పార్టీ వీడుతున్నారు ఆమెకు మద్దతు తెలిపిన కొందరు నేతలు. అందులో ప్రధానంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ ఒకరు. అంతేకాక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నయ్య చంద్రశేఖర్ రెడ్డి కూడా గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారట. ఈనెల 13న గద్వాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో కేటీఆర్ సమక్షంలో వీరిద్దరూ తమ అనుచరులతో బీఆర్‍ఎస్ పార్టీలొ చేరనున్నారు. అయితే ఎమ్మెల్యే బండ్ల.. కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గద్వాలలో బీఆర్‍ఎస్ చతికిలా పడ్డ పరిస్థితి ఉండేది. ఐతే మళ్ళీ ఇప్పుడు బీఎస్ కేశవ్, బండ్ల చంద్రశేకర్ రెడ్డి బీఆర్‍ఎస్ పార్టీలోకి వస్తుండటంతో గద్వాలలో ఆ పార్టీకి పూర్వవైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఐతే ఈ ఇద్దరు నేతలు కూడా కారు పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం సరిత తిరుపతయ్య వర్గమే అన్న వాదన లేకపోలేదు. ఈ నేపద్యంలో ఇటు ఎమ్మెల్యే బండ్ల కూడా తాను బీఆర్‍ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ప్రకటించడం, ఈ నెల 13న కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతలైన కేశవ్, బండ్ల చంద్రశేఖర్ బీఆర్‍ఎస్‍లో చేరనుండటం ఆసక్తికర పరిణామంగా మారిందట. దీంతో సరిత వర్గంలో ఓ వైపు ఆనందం, మరోవైపు ఆందోళన వ్యక్తమవుతున్నాయట.
తాను కారు పార్టీని వీడలేదని బహిరంగంగా ప్రకటించిన ఎమ్మెల్యే బండ్ల.. ఈ నెల 13న కేటీఆర్ సభకు హాజరవుతారా..? లేదా..? అన్నది ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే బండ్ల పరిస్థితి ఇలాఉంటే ఆయనపై ఎప్పటికప్పుడు సమరశంఖారావాన్ని పూరించే సరిత వర్గంలోనూ అయోమయ పరిస్థితులే కొనసాగుతున్నాయట. గద్వాలలో జరిగే ఈ తాజా పరిణామాలన్నీ అధికార కాంగ్రెస్‍పై తీవ్ర ప్రభావం చూపుతాయన్న టాక్ లేకపోలేదు. మరి చూడాలి.. గద్వాల రాజకీయాల్లో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో...?