Manda Krishna Madiga: మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ.. సామాజికోద్యమ శిఖరానికి కేంద్ర అత్యున్నత అవార్డు
Manda Krishna Madiga: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగకు దేశ అత్యున్నత పురస్కారం వరించింది. దశాబ్దాల పాటు ఆయన చేసిన సామాజిక ఉద్యమాలకు అరుదైన గౌరవం దక్కింది. పలు రంగాల్లో సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం శనివారం అవార్డులను ప్రకటించింది. తెలంగాణ నుంచి ఓరుగల్లు బిడ్డ సామాజిక ఉద్యమాల నాయకుడు కృష్ణమాదిగ మాదిగకు పద్మశ్రీ అవార్డు దక్కింది.
మందకృష్ణమాదిగ హన్మకొండ హంటర్ రోడ్డు న్యూశాయంపేటలో మంద చిన్న కొమురయ్య, కొమురమ్మ దంపతులకు 10వ సంతానం. 1965 జులై 7న జన్మించారు. ఆయన అసలు పేరు ఏలియా. భార్య జ్యోతి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
వామపక్ష భావజాలం, ప్రశ్నించేతత్వం ఉన్న కృష్ణమాదిగ కొంతకాలంలో పీపుల్స్ వార్ పార్టీలో నర్సంపేట నెక్కొండ ఏరియా ఆర్గనైజర్ గా పనిచేశారు. అరెస్ట్ అయిన తర్వాత ఏపీలోని పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు సత్యమూర్తితో కలిసి కారంచేడు, చుండూరు దళిత ఊచకోతకు వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. అప్పుడే మంద ఏలియా నుంచి కృష్ణమాదిగగా పేరు మార్చేసుకున్నారు.
కృష్ణమాదిగ, మాదిగ ఉపకులాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకుని ఎస్సీ ఎబిసిడీ వర్గీకణకోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. జులై 1,1994లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంప్రకారం జిల్లా ఈదుమూడి గ్రామంలో కొంతమంది యువకులతో కలిసి మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని ప్రారంభించారు. మాదిగ దండోరా ఉద్యమంతో కృష్ణమాదిగ అనతి కాలంలో మాదిగలకు ఆత్మగౌరవ ప్రతికగా నిలిచారు. మాదిగ దండోరా ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింపజేశారు. దండోరా ఉద్యమంతో 1997లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రామచంద్రరాజు కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 2000ఏప్రిల్ నుంచి 2004 నవంబర్ 4 వరకు ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది. దీంతో కృష్ణమాదిగ మాదిగలకు బలమైన నాయకుడిగా పేరొందారు. 1994 ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం, అనేక సామాజిక ఉద్యమాలను చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు వెల్లడించిన అనుకూల తీర్పు వరకు 30ఏళ్లుగా కృష్ణమాదిగకు ఉద్యమాల చరిత్ర ఉంది.